రాష్ట్ర వర్సిటీలకు జీఎస్‌టీని మినహాయించాలి

రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి అవసరమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి వీలుగా వాటిని జీఎస్‌టీ, ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని నీతి ఆయోగ్‌ సూచించింది.

Published : 19 Jun 2024 06:00 IST

ఆదాయపు పన్ను నుంచీ మినహాయింపు ఇవ్వాలి
పరిశోధనల ప్రోత్సాహానికి ఇదో మార్గం
నీతి ఆయోగ్‌ సిఫార్సు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి అవసరమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి వీలుగా వాటిని జీఎస్‌టీ, ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి ఈ మేరకు సిఫార్సు చేసింది. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ తరచూ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే పరిమిత బడ్జెట్‌తోనే నడుస్తుంటాయి. అందువల్ల వీటికి జీఎస్‌టీ నుంచి మినహాయింపునిస్తే పరిశోధనావసరాల కోసం ఇవి ఉపయోగించే వస్తు, సేవలపై అదనపు పన్ను భారం పడదు. తద్వారా కలిగే ఉపశమనం కారణంగా వర్సిటీలు తమ ఆర్థిక వనరులను బోధన, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ముఖ్యమైన కార్యకలాపాల కోసం సమర్థవంతంగా వినియోగించడానికి వీలవుతుంది. పరిశోధనలు, నవకల్పనలు, విద్యాభివృద్ధి కోసం వర్సిటీలు అందించే సేవల ఆధారంగా వాటికి ప్రోత్సాహకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటికి అదనపు గ్రాంట్లు, గుర్తింపు, ఇతరత్రా ప్రయోజనాలను అందించి అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా ప్రోత్సహించాలి’ అని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసింది. 2022 మార్చి 31 నాటికి దేశంలో 54 కేంద్రీయ, 450 రాష్ట్ర, 409 రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర శాసనసభల ద్వారా చేసిన చట్టాల ద్వారా ఏర్పడిన 4,126 డీమ్డ్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. పరిశోధన, అభివృద్ధి కోసం జీడీపీలో జర్మనీ 3%, జపాన్‌ 3.5%, సింగపూర్‌ 2%, భారత్‌ కేవలం 0.7% మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. దేశంలో ఆర్‌అండ్‌డీ కోసం కేటాయింపులు 2010-11 నుంచి 2020-21 మధ్యకాలంలో రూ.60,196.75 కోట్ల నుంచి రూ.1,27,380.96 కోట్లకు పెంచినప్పటికీ జీడీపీలో 2% ఖర్చు చేయాలన్న లక్ష్యం కంటే చాలా తక్కువని తెలిపింది. దేశంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు కేవలం ప్రభుత్వమే ఇప్పటివరకు నిధులు సమకూరుస్తూ రావడమే కొరతకు ప్రధాన కారణమని, అలాకాకుండా ఈ కార్యక్రమాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహిస్తే నిధుల కొరత తీరుతుందని నీతి ఆయోగ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని