మభ్యపెట్టి శస్త్రచికిత్స.. అమ్మాయిగా మారిన అబ్బాయి

ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే సినిమాటిక్‌ ప్రేమకథలు తరచూ వింటుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వాటన్నింటికీ మించి ప్రవర్తించాడో ఉన్మాది.

Published : 21 Jun 2024 06:07 IST

పెళ్లి కోసం ఓ యువకుడి భయానక కుట్ర

ముజఫర్‌నగర్‌ (ఉత్తర్‌పదేశ్‌): ఇష్టపడిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే సినిమాటిక్‌ ప్రేమకథలు తరచూ వింటుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వాటన్నింటికీ మించి ప్రవర్తించాడో ఉన్మాది. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అదీ అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇచ్చి చేశారు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువకుడితో ఓంప్రకాశ్‌ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్ష చేయిస్తానంటూ ఓంప్రకాశ్‌ జూన్‌ 3న మన్సూర్‌పుర్‌లోని బేగ్‌రాజ్‌పుర్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలన్నారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి పురుష అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యులతో కలిసి నాటకమాడి ఓంప్రకాశ్‌ ఈ తతంగమంతా నడిపాడు. స్పృహలోకి వచ్చిన యువకుడు లబోదిబోమంటూ తన కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పాడు. బాధితుడి తండ్రి జూన్‌ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓంప్రకాశ్‌ను అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనలో నిందితుడితోపాటు సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని