గూడ్సు సిబ్బంది, ఆపరేటింగ్‌ విభాగాలదే పొరపాటు

గూడ్సురైలు సిబ్బంది, న్యూ జల్పాయిగుడీ డివిజన్‌ ఆపరేటింగ్‌ విభాగ తప్పిదాలే కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి కారణాలుగా రైల్వేశాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Published : 21 Jun 2024 06:05 IST

కంచన్‌జంగా ప్రమాదంపై  ప్రాథమిక నివేదిక

దిల్లీ: గూడ్సురైలు సిబ్బంది, న్యూ జల్పాయిగుడీ డివిజన్‌ ఆపరేటింగ్‌ విభాగ తప్పిదాలే కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి కారణాలుగా రైల్వేశాఖ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 17న పశ్చిమబెంగాల్‌లోని దార్జీలింగ్‌ జిల్లా రంగపానీ స్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనకనుంచి గూడ్సురైలు ఢీకొని పదిమంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్స్‌ప్రెస్‌ రైలు గార్డు, గూడ్సు రైలు లోకోపైలట్‌ కూడా ఉన్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు వెనక భాగంలోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంపై ఆరుగురు సభ్యుల విచారణ బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ నిబంధనల్ని, వేగ పరిమితిని గూడ్సురైలు సిబ్బంది ఉల్లంఘించడమే ప్రమాదానికి కారణమని బృందంలోని అయిదుగురు సభ్యులు నివేదించగా, ఆరో అధికారి మాత్రం దీనితో విభేదించారు. న్యూ జల్పాయిగుడీ రైల్వే డివిజన్‌ ఆపరేటింగ్‌ విభాగం సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. రానీపత్రా- ఛత్తర్‌హాట్‌ జంక్షన్‌ మధ్య సిగ్నలింగ్‌ వ్యవస్థ దెబ్బతినడంతో.. రెడ్‌ సిగ్నల్‌ ఉన్నా ముందుకు వెళ్లేలా రెండు రైళ్ల లోకోపైలట్లకూ స్టేషన్‌మాస్టర్‌ అనుమతి ఇచ్చారు. వేగం విషయంలో ఉన్న నిబంధనను గూడ్సురైలు పైలట్లు పట్టించుకోలేదని నివేదికలో తెలిపారు. ప్రమాదంపై రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని