‘నెట్‌’ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ కేసు

యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై గురువారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చింది.

Published : 21 Jun 2024 05:50 IST

దిల్లీ: యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై గురువారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చింది. ఈ నెల 18వ తేదీన జరిగిన నెట్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో రూ.5లక్షల నుంచి రూ.6లక్షలకు అమ్ముడైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎన్‌టీఏ రద్దు చేసింది. దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. 

ఎన్‌టీఏ పనితీరుపై కమిటీ

వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఎన్‌టీఏ పనితీరుపై సూచనల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపైనా ఈ కమిటీ సూచనలు చేయనుంది. ‘ఎన్‌టీఏ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది. దాని నిర్మాణం, పనితీరు, పరీక్షల నిర్వహణ, పారదర్శకత, డేటా భద్రత వంటి అంశాల్లో సిఫార్సులు చేయడం కమిటీ విధి’ అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. కమిటీ సభ్యులను త్వరలోనే నియమిస్తామని, అంతర్జాతీయ నిపుణులు ఇందులో సభ్యులుగా ఉంటారని వివరించారు. 


విద్యార్థుల ప్రయోజనాల కోసమే

కేంద్రం

జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్‌-2024 పరీక్ష రద్దు నిర్ణయాన్ని తామే స్వతంత్రంగా తీసుకున్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షకు వ్యతిరేకంగా తమకు  ఫిర్యాదులు రాలేదని, కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమే రద్దు చేశామని తెలిపింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరామని కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్‌ జైశ్వాల్‌ తెలిపారు.  త్వరలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని