భారత్‌కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా

Published : 22 Jun 2024 05:48 IST

ప్రారంభమైన రెండు రోజుల పర్యటన

షేక్‌ హసీనాతో భేటీ అయిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

దిల్లీ: బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా రెండు రోజుల భారత పర్యటనకు శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. విమానాశ్రయంలో అధికారులు హసీనాకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో ఆమె సమావేశమయ్యారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. బంగ్లాదేశ్‌లో చైనా భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకూ కీలకం కానుంది. అనేక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. హసీనా.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తోనూ సమావేశం కానున్నారు.

సన్నిహిత, సుస్థిర సంబంధాలను నొక్కిచెబుతోంది: జైశంకర్‌ 

భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్యనున్న సన్నిహిత, సుస్థిర సంబంధాలను పొరుగుదేశ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారత అధికార పర్యటన నొక్కిచెబుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. హసీనాతో జైశంకర్‌ సమావేశమై వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని