సాక్ష్యాల నిరూపణలో ఈడీ విఫలం

మద్యం కుంభకోణంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నేరుగా సంబంధం ఉందన్న ఆరోపణలకు సాక్ష్యాలను చూపడంలో ఈడీ విఫలమైందని ట్రయల్‌ కోర్టు పేర్కొంది.

Published : 22 Jun 2024 05:49 IST

- కేజ్రీవాల్‌ బెయిల్‌ ఉత్తర్వులో ట్రయల్‌ కోర్టు

దిల్లీ: మద్యం కుంభకోణంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నేరుగా సంబంధం ఉందన్న ఆరోపణలకు సాక్ష్యాలను చూపడంలో ఈడీ విఫలమైందని ట్రయల్‌ కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు ఉత్తర్వులో ఈ విషయాలను వెల్లడించింది. గురువారం రాత్రి ఇచ్చిన ఈ ఉత్తర్వు రాత ప్రతి శుక్రవారం కోర్టు వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి వచ్చింది. కేజ్రీవాల్‌ను దోషిగా తేల్చే ప్రాథమిక ఆధారాల్లేవని ప్రత్యేక జడ్జి న్యాయ్‌ బిందు తెలిపారు. ‘మనీలాండరింగ్‌తో ముడిపడిన మద్యం కుంభకోణంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌)లో కానీ తన పేరు లేద’న్న కేజ్రీవాల్‌ వాదనకు ఈడీ సమాధానం ఇవ్వలేదని తెలిపారు. కుంభకోణంలో ప్రస్తావించిన నగదులో అత్యధిక భాగం ఎక్కడుందో ఇప్పటికీ ఈడీ గుర్తించలేదన్నారు. అందుకు ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితుల్లో నిందితుడిని జైలులోనే ఉంచాలన్న ఈడీ విజ్ఞప్తి సమర్థనీయంగా లేదని అభిప్రాయపడ్డారు. నేర నిరూపణ జరిగే వరకు నిందితుడు నిర్దోషేనన్న న్యాయసూత్రాన్ని జడ్జి ప్రస్తావించారు. ఈ కేసులో వాస్తవాలను రాబట్టడం కోసం కొందరు నిందితులకు బెయిల్, అరెస్టు నుంచి రక్షణ హామీలు ఇచ్చామన్న ఈడీ వాదనలను ప్రస్తావిస్తూ...‘ఇలాగైతే ఏ వ్యక్తినైనా కేసులో ఇరికించి, జైలులో బంధించే అవకాశం ఉంద’న్నారు. ఏళ్ల తరబడి జైలులో ఉన్న నిందితులు ఆ తర్వాత నిర్దోషులుగా తేలడం చాలా కేసుల్లో చూస్తున్నామని జడ్జి పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చూపిస్తున్న ఆధారాలు 2022 జులైలోనే ఈడీ వద్ద ఉన్నాయని, నోటీసులు ఇవ్వడానికి 2023 ఆగస్టు వరకు దర్యాప్తు సంస్థ ఎందుకు వేచిఉందన్న పిటిషనర్‌ ప్రశ్నకు సమాధానం లభించలేదన్నారు. దర్యాప్తు సంస్థ ఉద్దేశాలు నిష్పక్షపాతంగా ఉన్నట్లు భావించలేకపోతున్నట్లు వెల్లడించారు.

సునీతా కేజ్రీవాల్‌ ఆగ్రహం

దర్యాప్తు సంస్థ ఈడీ తీరుపై సునీతా కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తన భర్త, దిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ బెయిల్‌ ఉత్తర్వును ట్రయల్‌ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయకముందే ఈడీ ఎలా సవాల్‌ చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని