సంక్షిప్త వార్తలు (6)

ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల అధిపతులు పెరుగుతున్నారు. వ్యాపార నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలై వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

Updated : 22 Jun 2024 06:23 IST

వృత్తి కోసం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు

ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల అధిపతులు పెరుగుతున్నారు. వ్యాపార నిర్వహణ కార్యకలాపాల్లో తలమునకలై వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులూ పనిభారంతో సతమతమవుతున్నారు. ఆరోగ్యంపై ప్రభావం పడకుండా వారంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.       ఏ రంగంలో ఉన్నవారైనా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇటీవల చాలా మందిని క్యాన్సర్‌ కబళిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గ్రెయిల్‌ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ లక్షణాలను ముందుగానే పసిగట్టవచ్చు. నా వరకు నేను విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. 

బిల్‌ గేట్స్, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు


విడాకులు తీసుకున్న మహిళలను కించపరిచే దుస్సంప్రదాయం

విడాకులు తీసుకున్న మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే దుస్సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరం. చదువుకున్నవారు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళ జీవితాన్ని మాజీ జీవిత భాగస్వామితో పోలుస్తూ దురదృష్టవంతురాలు, నష్టజాతకురాలని తీర్మానించేస్తుంటారు. ఒకరి జీవిత సార్థకత గురించి తీర్పులిచ్చే అధికారం వేరొకరికి ఎందుకుంటుంది? ఈ ధోరణి ఇకనైనా మారాలి. విడాకులు తీసుకున్న మహిళను ఓ మనిషిగా మాత్రమే చూడండి. వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తించి గౌరవించండి. వేరొకరి జీవితాల్లోని పాత విషయాలను తవ్వుకుంటూ కూర్చొనే మైండ్‌ సెట్‌ను మార్చుకోండి.

రేణూ దేశాయ్, సినీ నటి


భారత్‌కు తగ్గిన ఎఫ్‌డీఐలు.. ఆర్థిక విధ్వంసమే కారణం

మోదీ ప్రభుత్వం పదేళ్లుగా కొనసాగించిన ఆర్థిక వ్యవస్థ విధ్వంస విధానాల కారణంగా దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. గతేడాది ఎఫ్‌డీఐలు ఏకంగా 43 శాతం తగ్గాయి. ఎఫ్‌డీఐ పరిమాణం విషయంలో 2022లో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ఉన్న భారత్, మరుసటి ఏడాదికి 15వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్‌ ముందు వరుసలో ఉందంటూ మోదీ చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలింది. ఇప్పటికైనా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆర్థిక విధానాలను సరిదిద్దుకోకపోతే మరింత నష్టం జరగడం ఖాయం.

సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి


విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

విద్వేష ప్రసంగాలు కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడమే కాదు, పెద్ద ఎత్తున హింసకూ ప్రేరేపించవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేష ప్రసంగాలను షేర్‌ చేయడం ఎంత ప్రమాదమో, వాటిని చూసీచూడనట్లు వదిలేయడం కూడా అంతే ప్రమాదం. వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. విద్వేష సమాచారంపై సామాజిక మాధ్యమ వేదికలకు ఫిర్యాదు చేయాలి. బాధితులకు అండగా నిలవాలి. సహనాన్ని ప్రోత్సహించే సందేశాలను పంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ఏదైనా సమాచారాన్ని పంచుకొనే ముందు దాన్ని ధ్రువీకరించుకోవాలి.

ఐక్యరాజ్య సమితి


కంది, మినుము 100% సేకరిస్తాం
- కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు స్థానికంగా పండే కంది, మినుము, మసూర్‌ పప్పును కనీస మద్దతు ధర కింద రైతుల నుంచి 100% సేకరిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. 2027కల్లా వీటి ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ-సమృద్ధి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దానివల్ల వారి వద్ద ఉన్న ఉత్పత్తులను కనీస మద్దతు ధర కింద పూర్తిగా కొనుగోలు చేయడానికి వీలవుతుందన్నారు. ప్రస్తుతం మన దేశం పెసలు, శెనగ ఉత్పత్తిలో స్వావలంబన సాధించిందని, దానివల్ల గత 10 ఏళ్లలో వీటి దిగుమతులు 30% నుంచి 10%కి తగ్గాయని వివరించారు. వరి సాగు పూర్తయిన తర్వాత ఆ పొలాల్లో పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు సూచించారు. కందిని అంతర్‌ పంటగా సాగు చేసేలా రైతులకు చేయూతనివ్వాలని కోరారు.


నీటి సంక్షోభంపై ఆతిశీ  నిరవధిక నిరాహార దీక్ష

దిల్లీ: దేశ రాజధాని దిల్లీకి హరియాణా నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు దిల్లీ మంత్రి ఆతిశీ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దక్షిణ దిల్లీలోని భోగల్‌లో శుక్రవారం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్, దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు. తిహాడ్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్‌ చదివి వినిపించారు. ఆతిశీ చేపట్టిన దీక్ష విజయవంతం అవుతుందని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దిల్లీకి పొరుగు రాష్ట్రాలు సహాయం చేస్తాయనుకున్నామని, కానీ దిల్లీ వాటాను హరియాణా ఇవ్వడం లేదన్నారు. రెండు రాష్ట్రాల్లో భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ.. ఇది రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన సమయమని వ్యాఖ్యానించారు. మరోవైపు, హరియాణా నుంచి దిల్లీకి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసే వరకు దీక్షను ఆపేది లేదని ఆతిశీ స్పష్టం చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని