జగమంతా యోగానందం!

‘స్వీయ, సమాజ ప్రయోజనాల కోసం యోగా’ అనే ఇతివృత్తంతో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది.

Updated : 22 Jun 2024 06:01 IST

దిల్లీ: ‘స్వీయ, సమాజ ప్రయోజనాల కోసం యోగా’ అనే ఇతివృత్తంతో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన కార్యాలయ సిబ్బందితో కలిసి యోగా చేశారు.  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆసనాలు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు దిల్లీలో యోగా చేశారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, సీఎంలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు. 

శారీరక వ్యాయామం, ఆధ్యాత్మికతల మేలు కలయిక యోగా అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అన్నారు. పలువురు సహచర న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయన యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ఆసనాలు వేశారు. 

సియాచిన్‌ మంచుకొండల్లో.. 

లద్దాఖ్‌లోని సియాచిన్‌ మంచుకొండల్లో ఆసనాలతో సైనికులు ఆకట్టుకున్నారు. విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై, హిందూ మహాసముద్రంతోపాటు పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో మోహరించిన పలు ఇతర యుద్ధనౌకలపై సిబ్బంది ఆసనాలు వేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొంతమంది ఔత్సాహికులు నీటిలో ‘జల యోగా’ చేసి అబ్బురపరిచారు. కేరళలో ఈ ఏడాది 10 వేల కొత్త యోగా క్లబ్‌లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వేలమంది దివ్యాంగులు ఉత్సాహంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఔత్సాహికులు యోగా సెషన్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేపాల్, చైనా, సింగపూర్, శ్రీలంక, ఫ్రాన్స్, బ్రిటన్, మలేసియా, ఇండోనేసియా, కువైట్, ఇటలీ తదితర దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాయి. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లో 300 మందికిపైగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద భారత కాన్సులేట్‌ జనరల్, టైమ్స్‌ స్క్వేర్‌ అలియన్స్‌ సంయుక్తంగా ప్రత్యేక యోగా సెషన్లను నిర్వహించాయి. వాషింగ్టన్‌లో వందల మంది ఔత్సాహికులు ఆసనాలు వేశారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగాసనాలు వేస్తున్న యోగా గురువు రాందేవ్‌ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ తదితరులు

సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ యోగాసనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని