వరుసగా ఎక్కువసార్లు గెలిచింది భర్తృహరే

లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ ఎంపికలో పార్లమెంటు సంప్రదాయాలను భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు విస్మరించిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తిప్పికొట్టారు.

Published : 22 Jun 2024 06:02 IST

అందుకే ఆయనకు ప్రొటెం స్పీకర్‌ పదవి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి
2004లో కాంగ్రెసే సంప్రదాయాలను విస్మరించిందంటూ విమర్శ

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ ఎంపికలో పార్లమెంటు సంప్రదాయాలను భాజపా నేతృత్వంలోని కేంద్ర సర్కారు విస్మరించిందన్న కాంగ్రెస్‌ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు తిప్పికొట్టారు. ప్రస్తుతం దిగువ సభకు అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ భర్తృహరి మహతాబేనని, అందుకే ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. భాజపా నేత అయిన భర్తృహరి వరుసగా ఏడుసార్లు ఎంపీగా గెలిచిన సంగతిని గుర్తుచేశారు. కేరళ ఎంపీ సురేష్‌ కొడుక్కునిల్‌ (కాంగ్రెస్‌) లోక్‌సభకు మొత్తంగా ఎనిమిదిసార్లు ఎన్నికైనప్పటికీ.. 1998, 2004లలో ఆయన ఓడిపోయారని తెలిపారు. ఆయన వరుసగా విజయం సాధించింది నాలుగుసార్లు మాత్రమేనని పేర్కొన్నారు. అందువల్ల ప్రొటెం స్పీకర్‌ పదవిని చేపట్టే అర్హత సురేష్‌కు లేదని స్పష్టం చేశారు. 17వ లోక్‌సభలో- అత్యధికసార్లు ఎన్నికైన ఎంపీగా మేనకాగాంధీ ఉన్నప్పటికీ.. వరుసగా అత్యధికసార్లు ఎన్నికైన వీరేంద్రకుమార్‌నే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసిన సంగతిని గుర్తుచేశారు. సభాసంప్రదాయాలను విస్మరించిన చరిత్ర కాంగ్రెస్‌దేనని రిజిజు విమర్శించారు. 2004లో సోమనాథ్‌ ఛటర్జీ, వాజ్‌పేయీ, జార్జ్‌ ఫెర్నాండెజ్, గిరిధర్‌ గమాంగ్‌ వంటి సీనియర్లను కాదని బాలాసాహెబ్‌ విఖే-పాటిల్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని