ఆదివారమే నెట్‌ పేపర్‌ లీక్‌.. వెంటనే డార్క్‌ నెట్‌లో!

ఈ నెల 18న యూజీసీ నిర్వహించిన నెట్‌ పరీక్ష పత్రాన్ని ఆదివారమే లీక్‌ చేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

Published : 22 Jun 2024 06:02 IST

దిల్లీ: ఈ నెల 18న యూజీసీ నిర్వహించిన నెట్‌ పరీక్ష పత్రాన్ని ఆదివారమే లీక్‌ చేశారని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దానిని ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో అమ్మకానికి ఉంచారని పేర్కొన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. 

నెట్‌లో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్‌ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ఐసీసీసీసీ) చెందిన జాతీయ సైబర్‌ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. అందులో వివరాల ప్రకారం.. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించింది. దాంతో వెంటనే ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. త్వరలో నెట్‌ పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. యూజీసీ నెట్‌ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌నకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి ఈ పరీక్షను కేంద్రం నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని