మోదీ పాలనలో విద్యావ్యవస్థ ధ్వంసం

మోదీ పాలనలో విద్యావ్యవస్థ ధ్వంసమైంది. ఈ ప్రభుత్వం నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను ఒక్క రోజు ముందు వాయిదా వేసి మరోసారి తమ అసమర్థతను చాటుకుంది.

Published : 23 Jun 2024 04:41 IST

మోదీ పాలనలో విద్యావ్యవస్థ ధ్వంసమైంది. ఈ ప్రభుత్వం నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను ఒక్క రోజు ముందు వాయిదా వేసి మరోసారి తమ అసమర్థతను చాటుకుంది. భాజపా పాలనలో విద్యార్థులు మెరుగైన కెరీర్‌ కోసం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సింది పోయి, తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది. పరీక్షల లీక్‌ మాఫియాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రధాని మోదీ ఉండటం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తు ఉండదు.

రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత


మణిపుర్‌లో ప్రజలకు భద్రత కరవు 

జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నవారికి బెయిల్‌ లభించినా బయట భద్రత లేదన్న కారణంతో బందీలుగానే ఉంచడం ఎక్కడైనా చూశారా? జాతుల మధ్య ఘర్షణతో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్న మణిపుర్‌లో ఈ వింత పరిస్థితి నెలకొంది. కుకీ తెగకు చెందిన 42 మందికి బెయిల్‌ వచ్చినా, వారిని జైలు నుంచి విడుదల చేయలేదు. మరో తెగ వారు దాడి చేయొచ్చన్న భయంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ హింసను రూపుమాపి ప్రభుత్వం శాంతిభద్రతలను స్థాపించకపోతే ఇక సామాన్యులను రక్షించేదెవరు?

ప్రశాంత్‌ భూషణ్, ‘సుప్రీం’ న్యాయవాది


బాధ్యత తీసుకున్న వారిదే అధికారం 

చాలామందికి బాధ్యత తీసుకోవాలంటే భయం. కానీ ఉద్యోగ ప్రస్థానంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా బాధ్యత తీసుకున్నవారికే అధికారం, హోదా సొంతమవుతాయి. మీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మీదేనని భావించినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. అలా కాక, ప్రభుత్వాన్నో లేదా ఇంకెవరినో నమ్ముకుంటే, వారికి మీపై అధికారం చలాయించే హక్కును మీరే స్వయంగా ఇచ్చినవారవుతారు. మీ కలలను సాకారం చేసుకోవాలన్నా, నాయకులుగా ఎదగాలన్నా బాధ్యతలు తీసుకోవడానికి భయపడకండి.

మార్క్‌ మాన్సన్, రచయిత


ఉక్రెయిన్‌లో 40 లక్షల మంది బడికి దూరం 

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ప్రతి 10 విద్యాలయాల్లో ఒకటి ధ్వంసమైంది. దీనివల్ల 40 లక్షల మందికి పైగా పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఈ విధ్వంసానికి ముగింపు పలకకపోతే వారు మళ్లీ బడి ముఖం చూడలేరు. దీనివల్ల వారు విద్యకు దూరమై భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతారు. శిబిరాల్లో తలదాచుకుంటున్న చిన్నారుల కోసం యునిసెఫ్‌ దాతల సహకారంతో తాత్కాలిక పాఠశాలలను కొనసాగిస్తోంది. ఇప్పటికైనా యుద్ధ పరిస్థితులను నిర్మూలించి శాంతిని పునరుద్ధరించడానికి ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి.

యునిసెఫ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని