యూపీని తేలిగ్గా తీసుకోవడంతో లెక్క తప్పింది.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ప్రదీప్‌ గుప్తా

లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సంస్థ అంచనా తప్పడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి మూడు దశల్ని తేలిగ్గా తీసుకోవడమేనని ‘యాక్సిస్‌ మై ఇండియా’ అధినేత ప్రదీప్‌ గుప్తా వెల్లడించారు.

Updated : 23 Jun 2024 10:57 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌లో తమ సంస్థ అంచనా తప్పడానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి మూడు దశల్ని తేలిగ్గా తీసుకోవడమేనని ‘యాక్సిస్‌ మై ఇండియా’ అధినేత ప్రదీప్‌ గుప్తా వెల్లడించారు. ఆ సమయంలో అనుభవజ్ఞులైన సిబ్బందిని యూపీ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్, దిల్లీ లాంటి చోట్లకు పంపామని ఆయన తెలిపారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు 361-400 మధ్య సీట్లు వస్తాయని, 80 స్థానాలున్న యూపీలో 67 స్థానాలు వస్తాయని యాక్సిస్‌ మై ఇండియా అంచనావేయగా.. ఎన్డీయే 293 సీట్లకే పరిమితమైంది. యూపీలో భాజపాకు 33 సీట్లే వచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన తమ విధానంలో తప్పులేదని, వనరుల్ని సరిగ్గా వినియోగించుకోకపోవడంతోనే అంచనాలు తప్పినట్లు గుప్తా తెలిపారు. ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న 64 కోట్ల మంది ఓటర్లలో తమ సిబ్బంది 5.82 లక్షల మందితో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.

మరోవైపు స్టాక్‌మార్కెట్‌లో కొన్ని వర్గాలకు లబ్ధిచేకూర్చేందుకే ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌పోల్స్‌ను వాస్తవాలకు దూరంగా ఇచ్చిందన్న విమర్శల్ని ప్రదీప్‌ గుప్తా తోసిపుచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష పార్టీలూ, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కోరుతున్నాయి. సెబీ, జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు కూడా దర్యాప్తు బృందంలో ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై అన్ని రకాల దర్యాప్తులకూ తాను సిద్ధమని గుప్తా చెప్పారు. ఈ విభాగంలో ప్రభుత్వం కచ్చితమైన నిబంధనల్ని తీసుకువస్తే ఈ రంగానికీ మేలు జరుగుతుందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని