ఇక వేగంగా ఇమిగ్రేషన్‌ తనిఖీలు

ముందస్తుగా అన్ని తనిఖీలు పూర్తిచేసుకున్న భారత పౌరులకు, విదేశాల్లోని భారత పౌరులకు (ఓసీఐ) భారత్‌లో ప్రవేశాన్ని వేగవంతం చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం ప్రారంభించారు.

Published : 23 Jun 2024 04:43 IST

ఎఫ్‌టీఐ-టీటీపీని ప్రారంభించిన షా

దిల్లీ: ముందస్తుగా అన్ని తనిఖీలు పూర్తిచేసుకున్న భారత పౌరులకు, విదేశాల్లోని భారత పౌరులకు (ఓసీఐ) భారత్‌లో ప్రవేశాన్ని వేగవంతం చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం ప్రారంభించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ వలసలు-విశ్వసనీయ ప్రయాణికుల కార్యక్రమం (ఎఫ్‌టీఐ-టీటీపీ)గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే భారత జాతీయులు, ఓసీఐ కార్డు గల ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగగానే ఇమిగ్రేషన్‌ తనిఖీలను త్వరగా పూర్తిచేసుకోవడానికి తోడ్పడే కార్యక్రమమిది. భారత్‌ చేపట్టిన ఎఫ్‌.టి.ఐ-టీటీపీ అమెరికా గ్లోబల్‌ ఎంట్రీ కార్యక్రమాన్ని పోలిఉంది. ముందస్తు తనిఖీలు పూర్తిచేసుకుని నిరపాయ ప్రయాణికులుగా నిర్ధారణ అయినవారికి కొన్ని అమెరికా విమానాశ్రయాలలో వేగంగా ఇమిగ్రేషన్‌ తనిఖీ జరిపి ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ 2047 ఎజెండాలో ఎఫ్‌.టి.ఐ-టీటీపీ ముఖ్యమైన అంతర్భాగమని అమిత్‌ షా పేర్కొన్నారు. దేశంలోని 21 ప్రధాన విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఉచితంగా ఎఫ్‌టీఐ-టీటీపీ సౌకర్యం అందిస్తామని తెలిపారు. మొదట దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడతారు. తొలి దశలో భారత పౌరులకు, ఓసీఐ కార్డుదారులకు, రెండో దశలో విదేశీ ప్రయాణికులందరికీ దీన్ని వర్తింపజేస్తారు. ఎఫ్‌టీఐ-టీటీపీ సౌకర్యం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా ముందే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు నిర్దేశిత తేదీల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వివరాలను ఇవ్వాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని