నీట్‌ లీకేజీ సూత్రధారి సంజీవ్‌ ముఖియా

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష-2024లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ మధ్యవర్తులు, విద్యార్థులుసహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Jun 2024 04:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష-2024లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ మధ్యవర్తులు, విద్యార్థులుసహా 14 మందిని బిహార్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. అతడే సంజీవ్‌ ముఖియా. దీంతో ఈ లీకేజీ రాకెట్‌ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నపత్రం మొదట అందింది సంజీవ్‌కేనని తెలుస్తోంది. అతడు ఓ ప్రొఫెసర్‌ ద్వారా పేపర్‌ తీసుకుని.. రాకీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు.. పట్నాలోని ఓ బాయ్స్‌ హాస్టల్‌ను అద్దెకు తీసుకుని అందులో 25 మంది విద్యార్థులకు వసతి కల్పించాడని సమాచారం. వారందరికీ లీకైన పేపర్‌ ఇచ్చి ప్రిపేర్‌ చేయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పేపర్‌ లీక్‌ వ్యవహారం బయటపడిన తర్వాత మే 6 నుంచి సంజీవ్‌ కనిపించకుండా పోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బిహార్‌లోని నలందా జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్‌ తొలుత సాబూర్‌ వ్యవసాయ కళాశాలలో పని చేసేవాడు. అక్కడ పేపర్‌ లీక్‌ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో వేటు వేశారు. ఆ కేసులో కొన్నాళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్‌ శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేరాడు. గతంలోనూ పలు ప్రభుత్వ పరీక్షల పేపర్‌ లీక్‌ కేసుల్లో ఇతడి పేరు బయటకు రావడం గమనార్హం.

కుమారుడి హస్తం

సంజీవ్‌ కుమారుడు శివ్‌ కుమార్‌కూ ఈ నేరాల్లో హస్తం ఉంది. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్‌.. బిహార్‌ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో  అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. వాస్తవానికి సంజీవ్‌ ముఖియా అసలు పేరు సంజీవ్‌ సింగ్‌. భార్య మమతా దేవీ భుఠాకర్‌ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి స్థానికులు ఇతడిని కూడా ముఖియాగా పిలుస్తున్నారు. సంజీవ్‌ భార్య 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రశ్నపత్రం లీక్‌ చేసిన  ఛానళ్లపై టెలిగ్రాం కొరడా

దిల్లీ: నీట్, నెట్‌ ప్రశ్న పత్రాలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లను బ్లాక్‌ చేసినట్లు టెలిగ్రాం వెల్లడించింది. దేశ చట్టాలకు లోబడి, దర్యాప్తునకు సహకరిస్తున్నామని తెలిపింది. లీకేజీ వ్యవహారంలో ఈ సోషల్‌ మీడియా సంస్థపైనా విమర్శలు వచ్చాయి. దీంతో సంస్థ స్పందించింది. టెలిగ్రాంలో లీకైన పేపర్లు అసలు పత్రంతో సరిపోలాయని ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని