సంక్షిప్త వార్తలు(8)

వారం రోజుల వ్యవధిలో బిహార్‌లో రెండో వంతెన కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్‌ జిల్లాలోని గండక్‌ కాలువ వంతెన శనివారం ఉదయం భారీశబ్దంతో ఒక్కసారిగా కూలిపోయింది.

Published : 23 Jun 2024 04:49 IST

బిహార్‌లో కుప్పకూలిన మరో వంతెన 

పట్నా: వారం రోజుల వ్యవధిలో బిహార్‌లో రెండో వంతెన కుప్పకూలింది. గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్‌ జిల్లాలోని గండక్‌ కాలువ వంతెన శనివారం ఉదయం భారీశబ్దంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మహారాజ్‌గంజ్‌ జిల్లాలోని పటేధి బజార్‌ మార్కెట్‌ను, దర్భంగాలోని రామ్‌గఢ్‌ పంచాయతీతో ఈ వంతెన కలుపుతోంది. దీని మీదుగా రోజూ వందల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనకు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే కూలిపోయిందని, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  


అస్సాంలో వరదలు.. 2.63 లక్షల మంది ప్రజలకు ఇబ్బందులు

గువాహటి: అస్సాంలో వరద ఉద్ధృతి శుక్రవారంతో పోల్చితే కాస్తంత తగ్గినట్లు శనివారమిక్కడ ఓ అధికారిక బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. గత 24 గంటల వ్యవధిలో రెండు మరణాలు సంభవించాయని చెప్పారు. దీంతో ఈ ఏడాది వరదలు, తుపానులు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల్లో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరింది. మరోవైపు, వరద ప్రభావిత ప్రజలు, జిల్లాల సంఖ్య తగ్గినట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికారసంస్థ బులెటిన్‌ పేర్కొంది.  


అమర్‌నాథ్‌ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత 

శ్రీనగర్‌: మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్ర కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామనీ, యాత్రికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించామని శనివారం జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తెలిపారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర కోసం నిర్వహించిన ‘ప్రథమ పూజ’ కార్యక్రమంలో సిన్హా వర్చువల్‌గా రాజ్‌భవన్‌ నుంచి పాల్గొన్నారు. 52 రోజులపాటు జరిగే ఈ యాత్రలో పాల్గొనడానికి దేశమంతటి నుంచి భక్తులు వస్తారు. నిరుడు 4.5 లక్షలమంది ఈ యాత్రలో పాల్గొని హిమలింగ దర్శనం చేసుకున్నారు. సరిహద్దు రహదారుల సంస్థ ఈ ఏడాది యాత్రా మార్గాన్ని కొన్ని చోట్ల మునుపటికన్నా వెడల్పు చేసింది.  


పోలీసులకు చిక్కిన ఫిక్సర్‌ రవి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: నీట్‌ పేపర్‌ లీక్‌లో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు రవి అత్రిని ఉత్తర్‌ ప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతడు సంజీవ్‌ ముఖియాకు సన్నిహితుడు. నోయిడాకు చెందిన ఇతడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. రవి గతంలోనూ పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టయ్యాడు. వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని కోటాలో ఇతడు కోచింగ్‌ తీసుకున్నాడు. 2012లో పరీక్ష పాసై రోహ్‌తక్‌ కాలేజీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా వచ్చేశాడు. అప్పటి నుంచి ‘ఎగ్జామ్‌ మాఫియా’ గ్యాంగ్‌తో సంబంధాలు నెరిపాడు. విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపించి పరీక్ష రాయించడం వంటి నేరాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.


ఝార్ఖండ్‌లో ఆరుగురి అరెస్టు

దేవ్‌గఢ్‌: నీట్‌ ప్రశ్నప్రతం లీకేజీకి సంబంధించి ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి ఆరుగురిని బిహార్‌ పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌గఢ్‌ ఎయిమ్స్‌కు సమీపంలోని ఇంట్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో పరంజీత్‌ సింగ్‌ అలియాస్‌ బిట్టూ, చింటూ అలియాస్‌ బలదేవ్‌ కుమార్, కాజు అలియాస్‌ ప్రశాంత్‌ కుమార్, అజిత్‌ కుమార్, రాజీవ్‌ కుమార్‌ అలియాస్‌ కరు ఉన్నారు. వీరంతా నలందా జిల్లాకు చెందినవారు. మరో నిందితుడు పంకు కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


నీట్‌ లీకేజీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరపాలి

- సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌

దిల్లీ: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ పరీక్ష రాసిన 10 మంది విద్యార్థులు ఈ పిటిషన్‌ వేశారు. బిహార్‌ పోలీసులు త్వరగా దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేలా చూడాలనీ వారు కోరారు. ఇప్పటికే నీట్‌ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.  


ఎయిర్‌ అరేబియా విమానానికి బాంబు బెదిరింపు

కోజీకోడ్‌: కేరళలోని కాలికట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయల్దేరాల్సిన ఎయిర్‌ అరేబియా విమానంలో శనివారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. దీంతో బాంబు నిర్వీర్యక బృందం సభ్యులు విమానంలో తనిఖీలు చేపట్టారు. షార్జా నుంచి కాలికట్‌కు వచ్చిన ప్రయాణికులలో ఒకరు సీటు మీద ‘బాంబు’ అని అని రాసి ఉంచారని, బోర్డింగుకు ముందు సిబ్బంది దాన్ని గుర్తించారని అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం అది ఉత్తుత్తి బెదిరింపు అని నిర్ధారించినట్లు తెలిపారు.  


ఇద్దరు ఉగ్రవాదుల హతం! 

శ్రీనగర్‌: నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు పాకిస్థాన్‌ ఉగ్రవాదులను భారత సైన్యం శనివారం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా, ఉరీ సెక్టార్‌ పరిధి నియంత్రణ రేఖ వెంబడి ఈ సంఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి మృతదేహాల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని