కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లో చైనా ‘అల్ట్రాసెట్‌’

నిన్న మొన్నటివరకు పాకిస్థాన్‌ ఒక్కటే కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ దేశానికి చైనా తోడైంది. పాకిస్థాన్‌కు డ్రాగన్‌ ఆయుధాలు సరఫరా చేయడం, ఇప్పుడవి కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతుల్లో కనిపించడం సర్వసాధారణమైపోయింది.

Published : 24 Jun 2024 05:04 IST

వీటి వెనక పాక్‌ సైన్యం హస్తం

శ్రీనగర్‌: నిన్న మొన్నటివరకు పాకిస్థాన్‌ ఒక్కటే కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ దేశానికి చైనా తోడైంది. పాకిస్థాన్‌కు డ్రాగన్‌ ఆయుధాలు సరఫరా చేయడం, ఇప్పుడవి కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేతుల్లో కనిపించడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కశ్మీర్‌లో పట్టుబడుతున్న ఉగ్రవాదుల చేతుల్లో పాకిస్థాన్‌ సైన్యం ఉపయోగిస్తున్న టెలికం పరికరాలు దొరుకుతున్నాయి. వీటిని ‘అల్ట్రాసెట్‌’ అని అంటారు. ఇవి అత్యంత ఆధునికమైనవి. ఈ పరికరాలు సంప్రదాయ జీఎస్‌ఎం, సీడీఎంఏ సాంకేతికతల ఆధారంగా పనిచేయవు. రేడియో తరంగాల ఆధారంగా పనిచేస్తాయి. పాకిస్థాన్‌ రక్షణ సామర్థ్యాలను బీజింగ్‌ బలోపేతం చేస్తోందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత కొంతకాలం వాస్తవాధీన రేఖ వెంబడి పాక్‌ సైన్యానికి కావాల్సిన ఆయుధాలను, ఇతర సామగ్రిని చైనా భారీ సంఖ్యలో సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఆ పరికరాలను పాక్‌ సైన్యం ఉగ్రవాదులకిచ్చి జమ్మూకశ్మీర్‌లోకి పంపిస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో సురన్‌కోట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ అల్ట్రాసెట్‌ పరికరాలను ఉగ్రవాదుల నుంచి భారత్‌ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ ఈ పరికరాలు లభ్యమయ్యాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) గుండా సాగే చైనా- పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)పై  చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల చేతుల్లోకి తమ సైనిక పరికరాలు వెళ్లినా చూసీచూడనట్లు చైనా వదిలేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు పీవోకేలోని లీపా లోయ వెంబడి పాక్‌ సైన్యం కోసం భారీ సొరంగాలు, బంకర్లు కూడా చైనా ఇంజినీర్లు నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిని ఉగ్రవాదులూ వినియోగించే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని