సంక్షిప్త వార్తలు(4)

నీట్‌ (యూజీ) పరీక్షలో గ్రేస్‌ మార్కులు కలిపిన 1,563 మందికి ఆదివారం పునః పరీక్ష (రీ ఎగ్జామ్‌) నిర్వహించగా 813 మంది హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని 7 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది.

Published : 24 Jun 2024 05:08 IST

నీట్‌ పునః పరీక్షకు 813 మంది హాజరు

దిల్లీ: నీట్‌ (యూజీ) పరీక్షలో గ్రేస్‌ మార్కులు కలిపిన 1,563 మందికి ఆదివారం పునః పరీక్ష (రీ ఎగ్జామ్‌) నిర్వహించగా 813 మంది హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశంలోని 7 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మే 5వ తేదీన నిర్వహించిన నీట్‌ ఆలస్యం కావడంతో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) వీరికి గ్రేస్‌ మార్కులను ఇచ్చింది. దీనిపై వివాదం రేగి సుప్రీం కోర్టుకు చేరడంతో ఈ నిర్ణయం వెలువడింది. పునః పరీక్షకు 52శాతం మంది హాజరయ్యారు. మరోవైపు బిహార్‌లో మే 5న జరిగిన పరీక్షకు హాజరైన 17 మందిని ఎన్‌టీఏ ఆదివారం డిబార్‌ చేసింది. అవకతవకలకు పాల్పడిన 63 మందిని గతంలోనే సంస్థ డిబార్‌ చేసింది. శనివారం గుజరాత్‌లోని గోధ్రాకు చెందిన 30 మందిని డిబార్‌ చేసింది. 


హసీనాకు 500 కేజీల క్వీన్‌ అనాసపళ్లు

- బహుమతిగా పంపిన త్రిపుర సీఎం మాణిక్‌ సాహా

అగర్తలా: బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి అరుదైన బహుమతి పంపారు. ఈ మేరకు ఆదివారం అఖౌరా సమీకృత చెక్‌పోస్ట్‌ (ఐసీపీ) ద్వారా 500 కేజీల క్వీన్‌ అనాసపళ్లను పంపించారు. ‘‘ముఖ్యమంత్రి మాణిక్‌సాహా నిర్ణయం మేరకు మేం 100 బాక్సుల్లో 500 కేజీల క్వీన్‌ అనాసపళ్లను బంగ్లాదేశ్‌ ప్రధానికి పంపించాం. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ అనాస పండు రకం’’ అని త్రిపుర ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు దీపక్‌ బైద్య విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. గతేడాది కూడా హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి అనాస పళ్లు పంపగా, ప్రతిగా హసీనా మామిడి పళ్లను పంపారు.  


సరదా కోసం విమానానికి ఉత్తుత్తి బాంబు బెదిరింపు

- అదుపులోకి 13 ఏళ్ల బాలుడు

దిల్లీ: దుబాయ్‌ వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు దిల్లీ విమానాశ్రయానికి తప్పుడు సమాచారంతో ఈ-మెయిల్‌ పంపిన 13ఏళ్ల బాలుడు పోలీసులకు ఆదివారం పట్టుబడ్డాడు. కొద్ది రోజుల క్రితం నకిలీ బెదిరింపు కాల్‌ చేసిన మరో యువకుడి వార్తలకు ప్రభావితమైన బాలుడు.. సరదా కోసం ఈ మెయిల్‌ పంపినట్లు డీసీపీ ఉషా రంగనాని తెలిపారు. బాలుడి ఈమెయిల్‌తో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించామని, విచారణలో ఇది ఉత్తుత్తి బెదిరింపే అని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ నుంచి ఈమెయిల్‌ వచ్చినట్లు గుర్తించి, అక్కడికి పోలీసుల బృందాన్ని పంపించామన్నారు. తల్లిదండ్రులు బాలుడికి చదువుకునేందుకు ఇచ్చిన మొబైల్‌ నుంచి మెయిల్‌ పంపి, తర్వాత దాన్ని బాలుడు తొలగించినట్లు వివరించారు. బాలుడిని అదుపులోకి తీసుకొని అనంతరం అతడి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.


భారత్‌ మళ్లీ బ్యాలట్‌ వైపు మొగ్గుచూపాలి: దీపాంకర్‌

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై విపక్షాలు ఆందోళనలు లేవనెత్తిన నేపథ్యంలో భారత్‌ మళ్లీ బ్యాలట్‌వైపు మొగ్గు చూపాలని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అన్నారు. ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు వీవీప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలని డిమాండ్‌ చేశాయని ఆయన తెలిపారు. అయితే సుప్రీంకోర్టు విపక్షాల కోరికను తిరస్కరించిందని అన్నారు. ఎన్నికల నిర్వహణ దేశ ప్రజల నమ్మకాన్ని చూరగొనాలంటే భారత్‌ బ్యాలట్‌ వైపు మొగ్గు చూపాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని