నీట్‌ అక్రమాలపై శిరోముండనంతో నిరసన

‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

Published : 04 Jul 2024 04:26 IST

కొత్త నేరచట్టాల కింద విద్యార్థి నేతలపై కేసులు

దిల్లీ: ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ బుధవారం దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు.. ప్రత్యేక ఆందోళన చేపట్టిన యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు మోదీ వ్యతిరేక నినాదాలతో శిరోముండనం చేయించుకున్నారు. గత ఎనిమిది రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వామపక్షాలకు చెందిన ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ), స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ), ఆలిండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌ఎఫ్‌)లతోపాటు సమాజ్‌వాదీ క్షాత్రసభ, కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ జంతర్‌మంతర్‌ వద్ద గుమికూడి పార్లమెంటు దిశగా కవాతుకు సిద్ధపడ్డాయి. ఎన్‌టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయాలని, ప్రవేశ పరీక్షలను వికేంద్రీకరించాలని విద్యార్థులు తమ డిమాండ్లు వినిపించారు. వైద్యవిద్య ప్రవేశపరీక్ష అయిన నీట్‌-యూజీని అభ్యర్థులు అందరికీ తిరిగి నిర్వహించాలని గళమెత్తారు. పోలీసు బందోబస్తు భారీగా ఉండటంతో విద్యార్థుల కవాతు ముందుకు సాగలేదు. జంతర్‌మంతర్‌ వద్ద బైఠాయించిన కొందరు విద్యార్థులపై కొత్త నేరచట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

నీట్‌-యూజీ కేసులో ఆరో వ్యక్తిని అరెస్టు చేసిన సీబీఐ

నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ కేసులో సహ కుట్రదారుగా ఆరోపణలు ఉన్న ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన అమన్‌సింగ్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇదే రాష్ట్రంలోని హజారీబాగ్‌కు చెందిన ఒయాసిస్‌ స్కూలు ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్‌లను ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. బిహార్, గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులపై మొత్తం ఆరు ఎఫ్‌ఐఆర్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు