ఝార్ఖండ్‌ సీఎంగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌!

జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 04 Jul 2024 04:43 IST

ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ రాజీనామా

రాంచీ: జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. ‘‘జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం నిర్ణయం మేరకు నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాను’’ అని రాజ్‌భవన్‌ వెలుపల చంపయీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామానికి కొద్దిసేపటి ముందే హేమంత్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్‌ రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హేమంత్‌కు రాంచీ హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేయడంతో అయిదు నెలల తర్వాత జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో  బుధవారం ఉదయం జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా చంపయీ సోరెన్‌ నివాసంలో సమావేశమై హేమంత్‌ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

సుప్రీంలో బెయిల్‌ను వ్యతిరేకించనున్న ఈడీ

మరోపక్క హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక సెలవుకాల పిటిషన్‌ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని