సంక్షిప్త వార్తలు

పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్‌ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది.

Updated : 05 Jul 2024 05:15 IST

పార్లమెంటు ప్రొరొగ్‌

దిల్లీ: పార్లమెంటు ఉభయ సభలను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రొరొగ్‌ చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశమైన సభలు తొలి విడతను పూర్తి చేసుకున్నట్లయింది. ఇటీవల నిరవధికంగా వాయిదా పడ్డ ఉభయ సభలను పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రొరొగ్‌ చేశారని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.


కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా ధీరేంద్ర ఓఝా నియామకం

దిల్లీ: ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ (ఐఐఎస్‌) సీనియర్‌ అధికారి ధీరేంద్ర కె.ఓఝా గురువారం కేంద్ర ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1990 బ్యాచ్‌ అధికారి అయిన ధీరేంద్ర...ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 


శ్రీనగర్‌లో రికార్డుస్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రత 

శ్రీనగర్‌: జులై నెల వచ్చినా కశ్మీర్‌లో ఎండలు తగ్గడం లేదు. శ్రీనగర్‌లో గరిష్ఠస్థాయిలో 35.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. గత పాతికేళ్లలో జులై నెలలో ఇదే అధిక ఉష్ణోగ్రత. సాధారణం కంటే ఇది ఆరు డిగ్రీలు ఎక్కువ. చివరిసారిగా 1999 జులైలో శ్రీనగర్‌లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో కూడా పలుచోట్ల 32.8, 35.2 డిగ్రీ సెల్సియస్‌ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు కంటే ఎక్కువగా ఇవి ఉంటున్నాయి. కొన్నివారాలుగా ఈ పోకడ కొనసాగుతుండడంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతోంది. లోయలో అన్ని పాఠశాలలకూ ఈ నెల 8 నుంచి 10 రోజులపాటు వేసవి సెలవుల్ని ప్రకటించారు. ప్రజలు తమ ఇళ్లుదాటి బయటకు రావడం లేదు. శుక్ర, శనివారాల్లో వానలు పడి ఉపశమనం లభిస్తుందని వాతావరణ విభాగం తెలిపింది.


మూడు శాతానికి తగ్గిన సగటు వర్షపాత లోటు!

దిల్లీ: వాయవ్య, ఈశాన్య భారతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో దేశంలో సగటు వర్షపాత లోటు మూడు శాతానికి పరిమితమైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గత నెల 30 నాటికి ఇది 11 శాతంగా ఉండేది. వాయవ్య భారతంలో 33 శాతంగా ఉన్న లోటు 14కు; మధ్య భారతంలో 14 నుంచి 8; తూర్పు, ఈశాన్య భారతంలో 13 నుంచి 2 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఇందుకు భిన్నంగా దక్షిణ భారతంలో మాత్రం 13% అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రకటించింది. గత నెల ఒకటిన మొదలైన వర్షాకాలంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 196.9 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 190.6 మి.మీ. పడిందని తెలిపింది. రాబోయే నాలుగైదు రోజుల్లో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అంచనావేసింది.


సీబీఐ తొలి ‘బీఎన్‌ఎస్‌’ ఎఫ్‌ఐఆర్‌

దిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) సెక్షన్ల ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో నిందితులిద్దరూ పోలీసులు కావడం గమనార్హం. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. డ్రగ్స్‌ కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న నిందితుడి విడుదలకు సహకరించడానికి ఈ ఇద్దరు పోలీసులు రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారు. వీరిపై బీఎన్‌ఎస్‌లోని 61(2) సెక్షన్‌ కింద సీబీఐ అభియోగాలు మోపింది.


సీఎం మమతపై గవర్నర్‌ పరువునష్టం కేసు విచారణ 10న

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై రాష్ట్ర గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల పదో తేదీన విచారిస్తామని కలకత్తా హైకోర్టు గురువారం వెల్లడించింది. రాజ్‌భవన్‌లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు. 


కొత్త సిలబస్‌ విధానం మేర.. పాఠ్యపుస్తకాల ముద్రణపై సమీక్ష

దిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గురువారం అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్‌ విధానం మేరకు స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు. ఏప్రిల్‌ నెల నుంచే బోధించాల్సిన ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు ఇంకా మార్కెట్లోకి రాని నేపథ్యలో ఈ సమీక్ష జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 3, 6 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు తీసుకొస్తామని ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో తరగతి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఆరో తరగతి పుస్తకాల రూపకల్పన తుదిదశకు చేరుకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారం ఆరో తరగతికి చెందిన ఇంగ్లిషు, హిందీ పాఠ్యపుస్తకాలను ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసింది. మిగతా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేదాకా బ్రిడ్జి ప్రోగ్రాం బోధించవలసిందిగా సూచనలు జారీ చేశారు. జాతీయ విద్యావిధానం మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త సిలబస్‌లో 2026 కల్లా సమగ్ర పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎన్‌సీఈఆర్టీ లక్ష్యం. 6వ తరగతి కోసమని ‘పూర్వీ’ పేరుతో రూపొందించిన ఇంగ్లిషు పాఠ్యపుస్తకం చాలా అధ్యయాల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మార్పులు చేర్పులు చేశారు. ‘కల్చర్‌ అండ్‌ ట్రెడిషన్‌’ అనే ఛాప్టర్‌లో ‘ఇండియా’ అనే పదానికి ప్రత్యామ్నాయంగా ‘భారత్‌’ అని వాడారు. కేంద్ర మంత్రితో జరిగిన సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి, ఎన్‌సీఈఆర్టీ సంచాలకుడు, సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.


‘కూ’ వైఫల్యం నేర్పిన పాఠమిదే..

ట్విటర్‌(ఇప్పుడు ‘ఎక్స్‌’)కు దేశీయ ప్రత్యామ్నాయంగా ప్రారంభమైన ‘కూ’ సంస్థ నాలుగేళ్లకే మూతపడుతోంది. భారత్‌లో కోట్ల మంది సామాజిక మాధ్యమాల వినియోగదారులున్నప్పటికీ వారిని ఈ సంస్థ ఆకర్షించలేకపోయింది. దీన్నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలోనూ స్వదేశీ సంస్థలు ఉండాల్సిన అవసరముంది కానీ, అప్పటికే మరో కంపెనీ ద్వారా అందుబాటులో ఉన్న సేవలనే అందిస్తే మనుగడ సాగించడం కష్టం. వినూత్నంగా ఆలోచించి తమ సేవలకు అదనపు విలువ జోడిస్తేనే విజయవంతం కాగలదు. ఉద్యోగులు అందించే సేవల విషయంలోనూ ఇది వర్తిస్తుంది.

భవిశ్‌ అగర్వాల్, ఓలా క్యాబ్స్‌ సహ వ్యవస్థాపకులు 


కార్పొరేట్‌ బోర్డుల్లో పెరిగిన మహిళల ప్రాతినిధ్యం 

కార్పొరేట్‌ సంస్థల బోర్డుల్లో మహిళలకు చోటు కల్పించడాన్ని తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం 2013లో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్నిచ్చింది. బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం 15.7 శాతానికి చేరింది. మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. మరోవైపు 2014-2023 మధ్య సీనియర్‌ మేనేజ్మెంట్‌ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం 13.8 శాతం నుంచి 21.8 శాతానికి పెరిగింది. అయితే ఆ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముంది. సంస్థల్లోని అన్ని స్థాయుల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి.

అనూష రవిసూద్, పాత్రికేయురాలు


అక్రమ నిర్మాణాల కేసుల్లో కోర్టులను పావులుగా వాడుకుంటున్నారు: దిల్లీ హైకోర్టు 

దిల్లీ: అక్రమ నిర్మాణాల కేసుల్లో కోర్టులను అటు అధికారులు.. ఇటు కొందరు న్యాయవాదులు పావులుగా వాడుకుంటున్నారని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసిన వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కొందరు కావాలనే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పేర్కొంది. ‘‘మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు. వ్యవస్థ కుప్పకూలుతోంది. మీరు మీ అధికారులపై తీవ్ర చర్యలు తీసుకోండి. ఈ కేసుల్లో న్యాయస్థానాలను అటు పిటిషనర్లు, ఇటు అధికారులు వ్యూహాత్మకంగా వాడుకుంటున్నాయి. అనధికారిక కట్టడాలపై కొందరు వృత్తి నిపుణులు కేసులు వేస్తున్నారు. మేం విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాం. మేం చర్య తీసుకుంటే యజమాని నుంచి వారు డబ్బులు వసూలు చేస్తారు. మేం చర్యలు తీసుకోకపోతే అక్రమ నిర్మాణం అలానే ఉండిపోతుంది’’ అని దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఉద్దేశించి తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.


మైనర్లను అవమానిస్తే సహించబోం: హైకోర్టు

దిల్లీ: న్యాయపరమైన వ్యూహంలో భాగంగా లైంగిక వేధింపులకు గురైన మైనర్లను, వారి కుటుంబ సభ్యులను అవమానిస్తే సహించబోమని దిల్లీ హైకోర్టు పేర్కొంది. యజమాని మైనర్‌ కుమార్తెకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తికి ట్రయల్‌ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను సమర్థిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తనకు జీతం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మైనర్‌ కుమార్తె తండ్రే ఆ అభ్యంతరకర దృశ్యాలను విడుదల చేశారని నిందితుడి తరఫున న్యాయవాది వాదన చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయపరమైన వ్యూహంలో భాగంగా మైనర్లను, వారి కుటుంబసభ్యులను అవమానించడాన్ని తాము సహించబోమని స్పష్టం చేసింది. 


భోజ్‌శాల సర్వే నివేదిక సమర్పణకు గడువు పెంపు

ఇందౌర్‌: భోజ్‌శాల/కమల్‌ మౌలా మసీదుకు సంబంధించిన సర్వే పూర్తి చేయడానికి భారత పురాతత్వ సర్వే (ఏఎస్‌ఐ) విభాగానికి అదనంగా 10 రోజుల గడువును గురువారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు మంజూరు చేసింది. హైకోర్టు గత ఉత్తర్వుల ప్రకారం.. నివేదిక జులై 2న సమర్పించాలి. అయితే మరో నాలుగు వారాలు గడువు కావాలని కోర్టును ఏఎస్‌ఐ అభ్యర్థించింది. ఇందుకు న్యాయస్థానం అనుమతించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణంపై సర్వేకు మార్చి 11న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని హిందువులు సరస్వతి దేవాలయంగా విశ్వసిస్తున్నారు. ముస్లింలు కమల్‌ మౌలా మసీదుగా పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు