లోక్‌సభ విజేతల సగటు ఓట్లు 50.58%

లోక్‌సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది.

Published : 05 Jul 2024 05:13 IST

ఏడీఆర్, న్యూ విశ్లేషణ 

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో విజేతలు సగటున 50.58 శాతం ఓట్లను సాధించారని, గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2 శాతం మేర తగ్గినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (న్యూ) 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 542 చోట్ల ఓట్ల షేరింగుపై సమగ్ర విశ్లేషణను విడుదల చేశాయి. గుజరాత్‌లోని సూరత్‌ నియోజకవర్గ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనందున దానిని విశ్లేషణ నుంచి మినహాయించాయి. ఈ ఎన్నికల్లో 279 మంది విజేతలు (51 శాతం) తమ నియోజకవర్గాల్లోని మొత్తం ఓట్లలో సగానికి పైగా సాధించారు.

  • భాజపాకు చెందిన 239 మంది విజేతల్లో 75 మంది (31 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన 99 మంది విజేతల్లో 57 మందికి (58 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి 37 మంది విజేతల్లో 32 మంది (86 శాతం), టీఎంసీ నుంచి 29 మంది విజేతల్లో 21 మంది (72 శాతం), డీఎంకే నుంచి 22 మంది విజేతల్లో 14 మంది (64 శాతం) 50 శాతం కంటే తక్కువ ఓట్లు సాధించారు. క్రిమినల్‌ కేసులున్న 251 మంది విజేతల్లో 106 మంది (42 శాతం) 50 శాతంపైన ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎటువంటి కేసులు లేని 291 మంది విజేతల్లో 173 మంది (59 శాతం) 50 శాతానికి పైగా ఓట్లు సాధించారు. 
  • మొత్తం విజేతల్లో 503 మంది కోటీశ్వరులు కాగా.. ఇందులో 262 మంది (52 శాతం) 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. కోటీశ్వరులు కాని 39 మందిలో 17 మంది (44 శాతం) కూడా ఈ మార్కును సాధించారు. అయిదుగురు అభ్యర్థులు 2,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

542 మంది విజేతల్లో 74 మంది మహిళలు ఉన్నారు. వీరిలో త్రిపుర తూర్పు నుంచి కృతిదేవి (భాజపా) 68.54 శాతం ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించారు. తిరిగి ఎన్నికైన 214 మందిలో 101 (47 శాతం) మంది 50 శాతానికి పైగా ఓట్లతో, 92 మంది మాత్రం 10 శాతం కంటే తక్కువ తేడాతో గెలుపొందారు. మొత్తం ఓట్లలో నోటాకు 0.99 శాతం పడ్డాయి. ఇది 2019లో 1.06 శాతం, 2014లో 1.12 శాతంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగు శాతం 66.12 కాగా.. 2019లో 67.35 శాతం ఓటింగు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని