బ్రహ్మపుత్రి

వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్‌ జిల్లాలోని పులియామారి చార్‌!

Updated : 05 Jul 2024 07:49 IST

నది మధ్యలో పడవలోనే జహనారా ప్రసవ వేదన

అమ్మ కడుపు చల్లగా...అయ్య కలలు పండగా...

గరిమల మురిపెపు నీ ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం...
...అంటూ పడవలోని వారు పాడలేదుగాని... నిండుకుండలా పారుతున్న బ్రహ్మపుత్రలో... నిండు చూలాలికి అండగా నిలిచారు... పండంటి పాపను చేతిలో పెట్టారు!

ఒకవైపు ఉప్పొంగుతున్న నది...
మరోవైపు పోటెత్తుతున్న వరద...
మళ్లీ దట్టంగా కమ్ముకుంటున్న మేఘాలు...

కింద వరద... పైన టార్పాలిన్‌ పరదాగా...

వానలు పెరిగాయంటే... అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలోగల రెండువేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలూ అరచేతుల్లో! అలాంటి లంకల్లో ఒకటి మొరిగావ్‌ జిల్లాలోని పులియామారి చార్‌! అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్, జహనారా ఖాతూన్‌ కుటుంబం! తొమ్మిది నెలలు నిండిన జహనారా ప్రసవం నేడోరేపో అనుకునేంతలో... వరదలు ముంచెత్తాయి. వెంటనే ఆ ఊరంతా... పక్కనున్న చార్స్‌ అనే మరో లంకకు వెళ్లి తలదాచుకుంది. వారికి సాయం అందించటం కోసం వచ్చిన సంచార వైద్య బృందం... జహనారా పరిస్థితి గమనించి తక్షణమే... వైద్య శిబిరానికి తరలించేందుకు పడవ ఎక్కించింది.

కానీ... కడుపులోని బిడ్డ  అప్పటిదాకా ఆగనంది! నొప్పులు తీవ్రమయ్యాయి... పైనుంచి చిటపట చినుకులూ  మొదలయ్యాయి... కింద సుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర..

బ్రహ్మపుత్ర ఒడిలో.. పండంటి బిడ్డతో ఆయా

....అయినా ఆ వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా... తల్లికి ధైర్యం చెబుతూ... మేఘాలు గొడుగుపట్టగా... చినుకులు చిందులేయగా... రక్షణ కోసం తెచ్చుకున్న  టార్పాలిన్‌ పరదాగా... ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యారు! నిండు బ్రహ్మపుత్రలో... జహనారా పండంటి పుత్రికకు జన్మనిచ్చింది! ‘‘నా భార్య కుమారుడు పుట్టాలని కోరుకుంది. కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు. అయినా నాకెంతో సంతృప్తిగా ఉంది. ఈ బిడ్డకు కరీమా (ప్రసాదం) అని పేరు పెడతాం’’ అని పడవలోనే ఎగిరిగంతులేస్తూ... చెప్పాడు తండ్రి కలాముద్దీన్‌!

దేవుడిచ్చిన ప్రసాదం... తండ్రి బ్రహ్మానందం...

మొరిగావ్, అస్సాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు