రోజువారీ మరణాల్లో 7శాతం వాయు కాలుష్యం వల్లే

దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది.

Published : 05 Jul 2024 05:31 IST

దిల్లీ: దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సహా పది నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7శాతానికి పైగా ఈ కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనం ద్వారా వెల్లడించింది. 2008 నుంచి 2019 మధ్య పదకొండేళ్ల కాలంలో సంభవించిన దాదాపు 36 లక్షల మరణాలను విశ్లేషించారు. రోజువారి మరణాలు, వాయు కాలుష్యం మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, శిమ్లా, వారణాసిలలో కొనసాగించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయ నిపుణులతో పాటు భారత శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని నివేదిక వెల్లడించింది. సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది. మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయులను అంచనా వేశారు. 

  • పీఎం 2.5 స్థాయిలు ప్రతి ఘనపు మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్లు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది. పీఎం 2.5 రేణువులు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు దిల్లీలో 0.31 శాతం, బెంగళూరులో 3.06 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. 
  • దేశ రాజధాని దిల్లీలో సగటున ప్రతీ ఏడాది 11.5 శాతం మరణాలు (11,964) వాయు కాలుష్యం కారణంగా సంభవించాయని తెలిపారు. దేశంలో అత్యధిక మరణాలు ఈ మహానగరంలోనే నమోదయ్యాయి.
  • శిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం.
  • హైదరాబాద్‌లో వాయు కాలుష్యం వల్ల 5.6 శాతం మరణాలు (1,597) సంభవించాయి.

వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్‌లో ఇదే తొలిసారని మరో పరిశోధకుడు భార్గవ్‌ కృష్ణ తెలిపారు. భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు దీనివల్ల వెల్లడైనట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని