సంక్షిప్త వార్తలు

ఖలిస్థాన్‌ అనుకూలవాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్‌ అబ్దుల్‌ రషీద్‌లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు.

Published : 06 Jul 2024 04:34 IST

ఎంపీలుగా ప్రమాణం చేసిన అమృత్‌పాల్, షేక్‌ అబ్దుల్‌ రషీద్‌

దిల్లీ: ఖలిస్థాన్‌ అనుకూలవాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్, కశ్మీరీ నాయకుడు షేక్‌ అబ్దుల్‌ రషీద్‌లు శుక్రవారం భారీ భద్రత నడుమ పార్లమెంటులో ఎంపీలుగా ప్రమాణం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఛాంబర్‌లో వారు ఎంపీలుగా ప్రమాణం చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. అస్సాం జైలు నుంచి అమృత్‌పాల్‌ సింగ్‌ను శుక్రవారం ఉదయం అధికారులు ప్రత్యేక విమానంలో దిల్లీకి తీసుకువచ్చారు. ఎంపీగా ప్రమాణం చేయడం కోసం ఆయనకు కొద్దిరోజుల క్రితం అమృత్‌సర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ నాలుగు రోజులు పెరోల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అమృత్‌పాల్‌ ప్రస్తుతం జాతీయ భద్రత చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు ఇంజినీర్‌ రషీద్‌గా పేరుగాంచిన కశ్మీర్‌ నాయకుడు షేక్‌ అబ్దుల్‌ రషీద్‌.. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉపా చట్టం కింద దిల్లీలోని తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రమాణం కోసం ఆయన రెండు గంటల కస్టడీ పెరోల్‌పై బయటకు వచ్చారు. 


రికార్డు స్థాయిలో దేశీయ ఆయుధాల ఉత్పత్తి 

దిల్లీ: భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం అనేక కొత్త మైలురాళ్లను అధిగమించిందన్నారు. 2022-23లో దేశీయ ఆయుధ ఉత్పత్తి విలువ 1,08,684 కోట్లుగా ఉండేదని చెప్పారు. 2023-24లో 16.8 శాతం వృద్ధితో అది దాదాపు రూ.1.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇది స్వాగతించదగ్గ పరిణామమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మన సామర్థ్యాలను మరింత మెరుగుపరచుకొని, భారత్‌ను అంతర్జాతీయ ఆయుధ ఉత్పత్తి హబ్‌గా మార్చడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉన్నాం. దీనివల్ల మన భద్రతా వ్యవస్థ బలోపేతమవుతుంది. స్వయంసమృద్ధి సాధించడానికి వీలవుతుంది’’ అని ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఆయుధ ఉత్పత్తుల విలువలో 79.2 శాతాన్ని ప్రభుత్వ రంగ ఆయుధ పరిశ్రమలు (డీపీఎస్‌యూలు)/ ఇతర ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూలు) ఉత్పత్తి చేశాయి. ప్రైవేటు రంగం వాటా 20.8 శాతంగా ఉంది. 


కేజ్రీవాల్‌ బెయిలు అర్జీపై సీబీఐకి నోటీసు

దిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో బెయిలు కోసం దిల్లీ సీఎం  కేజ్రీవాల్‌ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానమివ్వాల్సిందిగా శుక్రవారం సీబీఐని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఈ నెల 17న తదుపరి విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ తెలిపారు.


30 ఏళ్లుగా ఒక్క చీరా కొనుక్కోలేదు

కాశీ క్షేత్రంలో పుణ్యస్నానం చేసి మనకు నచ్చింది వదిలేస్తే మంచిదనే సంప్రదాయం ఉంది. నాకు షాపింగ్‌ అంటే చాలా ఇష్టం ఉండేది. అందుకే ఓసారి వారణాసి వెళ్లినప్పుడు గంగా నదిలో షాపింగ్‌ని వదిలేశా. అప్పట్నుంచి మరీ ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొంటున్నా. గత 30 ఏళ్లలో ఒక్క చీరా కొనుక్కోలేదు. షాపింగ్‌ వదిలేసిన తర్వాత తొలినాళ్లలో నా అక్కాచెల్లెళ్లు ఏటా రెండు చీరలు పెట్టేవారు. అలా ఇవ్వొద్దని ఆ తర్వాత వారికి చెప్పా. ఉన్న చీరలనే మళ్లీ మళ్లీ కడుతున్నా. మా తల్లిదండ్రులు, తాతముత్తాతలు ఉన్నంతలో పొదుపుగా జీవించారు. వారి నుంచే నాకు నిరాడంబరత అలవాటైంది. మా అమ్మకు 8-10 చీరలే ఉండేవి. మా బామ్మ దగ్గర నాలుగే ఉండేవి. నేనూ వారిలాగే పొదుపుగా జీవించాలని నిర్ణయించుకున్నా. 

సుధామూర్తి, రాజ్యసభ సభ్యురాలు 


మీరు ఎదిగితే.. చాలామంది తట్టుకోలేరు!

జీవితం చాలా అందమైనది. మీ చుట్టూ ఉన్నవారిలో కొందరు మీ గురించి ఆలోచించే తీరు మార్చుకున్నంత మాత్రాన మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. మీతో ఎలాంటి ముప్పూ పొంచి లేదని భావించినప్పుడే చాలామంది మీతో బాగుంటారు. వారి కంటే మీరు తక్కువగానో.. లేదంటే వారితో సమానంగానో ఉంటేనే అభిమానిస్తారు. కానీ మీరు ఎదిగినా.. మీలో విశ్వాసం పెరిగినా.. మీకు ఎక్కువ గుర్తింపు వచ్చినా.. చాలామంది తట్టుకోలేరు. అప్పటివరకూ మిమ్మల్ని మెచ్చుకున్నవారే ఒక్కసారిగా మీపై విమర్శలు గుప్పించడం మొదలుపెడతారు. మిమ్మల్ని విలన్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు. మీరేమీ తప్పు చేయలేదని, కేవలం ఎదగడం వల్లే వారి ద్వేషానికి గురయ్యామని మీరు అర్థం చేసుకునేంద]ుకు కొన్నిసార్లు దశాబ్దాల కాలం పట్టొచ్చు. 

డాక్టర్‌ ఉమాకుమార్, దిల్లీ ఎయిమ్స్‌ వైద్యురాలు


వారి ఒత్తిడికి లేబర్‌ పార్టీ తలొగ్గొద్దు

ప్రజాస్వామ్య దేశాల్లో అధికార మార్పు అనివార్యం! 14 ఏళ్ల విరామం తర్వాత బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దేశీయంగా వేధిస్తున్న సమస్యలను కీర్‌ స్టార్మర్‌ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. భారత్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాల్లో ఆయన ఎలా నడుచుకుంటారన్నదీ ఆసక్తికరమే. ముఖ్యంగా- గాజా ఎజెండాలో కశ్మీర్‌ విషయాన్నీ చేర్చాలని ముస్లిం లాబీ ఇకపై ఒత్తిడి పెంచొచ్చు. ఖలిస్థానీలూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయొచ్చు. వారి ఒత్తిడికి లేబర్‌ పార్టీ సర్కారు తలొగ్గితే.. భారత్‌-బ్రిటన్‌ సంబంధాలు దెబ్బతింటాయి. 

స్వపన్‌ దాస్‌గుప్తా, రాజకీయ విశ్లేషకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని