భోలే బాబాకు రూ.100 కోట్ల ఆస్తులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.

Published : 06 Jul 2024 04:35 IST

24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దుర్ఘటనపై జ్యుడిషియల్‌ విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హామీ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న సూరజ్‌పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా దొరికితే ప్రశ్నిస్తామని అలీగఢ్‌ ఐజీ శలభ్‌ మాథుర్‌ గురువారం తెలిపారు. కేసులో బాబాను నిందితుడిగా చేర్చలేదని వెల్లడించారు. ఈ క్రమంలో భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్‌ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు వెల్లడించింది. భోలే బాబాకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు.

13 ఎకరాల్లో ఆశ్రమం

దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు భోలే బాబా కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్‌ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన వాహనశ్రేణి ఉంటుంది. దీంట్లో తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీట్లతో పాటు లోపలి భాగమంతా పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు. సూరజ్‌పాల్‌ మైన్‌పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.

ప్రధాన నిందితుడి కోసం గాలింపు

భోలే బాబా ప్రధాన సేవకుడు దేవప్రకాశ్‌ మధుకర్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాలైన హరియాణా, రాజస్థాన్‌లోనూ వెతుకుతున్నారు. ఈ నెల 2న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రధాన నిందితుడిగా మధుకర్‌ను పోలీసులు పేర్కొన్నారు.

నిర్వాహకులదే తప్పిదంగా కనిపిస్తోంది

121 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటన వెనక కార్యక్రమ నిర్వాహకుల తప్పిదమే కనిపిస్తోందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధిపతి ఏడీజీ అనుపమ్‌ కురుక్షేత్ర తెలిపారు. శుక్రవారం సిట్‌.. తన ప్రాథమిక నివేదికను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి 90 మంది వాంగ్మూలాలను సిట్‌ రికార్డు చేసింది. ‘‘తొక్కిసలాట ఘటనపై రూపొందించిన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఇప్పటికే సమర్పించాం. హాథ్రస్‌ డీఎం ఆశీష్‌ కుమార్, ఎస్పీ నిపుణ్‌ అగర్వాల్, ఇతర అధికారుల వాంగ్మూలాలను ఇందులో పొందుపర్చాం. కేసులో పూర్తిస్థాయి దర్యాప్తును ముమ్మరం చేశాం. ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలు.. నిర్వాహకుల వైపే సూచిస్తున్నాయి’’ అని ఏడీజీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని