నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు

నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Published : 06 Jul 2024 04:38 IST

నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారు
సుప్రీంకోర్టులో కేంద్రం, ఎన్‌టీఏ అఫిడవిట్లు

దిల్లీ: నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐ విచారిస్తున్నట్లు తెలిపింది. పరీక్ష రద్దు చేస్తే అభ్యర్థుల కెరీర్‌ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్‌టీఏ మే నెల 5న నీట్‌-యూజీ పరీక్ష నిర్వహించింది. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పరీక్షను రద్దు చేసి కోర్టు పర్యవేక్షణలో మళ్లీ నిర్వహించాలంటూ పలువురు అభ్యర్థులు, అభ్యర్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ కేంద్ర విద్యా శాఖ, ఎన్‌టీఏ అఫిడవిట్లు దాఖలు చేశాయి.

ఫలితాలు వచ్చాక రద్దు సబబు కాదు

‘‘దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 23 లక్షల మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫలితాలు కూడా విడుదలైన ఈ పరీక్షను మొత్తానికే రద్దు చేయడం సహేతుకం కాదు. నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు అది నష్టం చేకూరుస్తుంది’’ అని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివి ఎలాంటి అక్రమ పద్ధతులు అనుసరించకుండా నిజాయతీగా పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. అక్రమాలకు ఆధారాలు ఉన్న సందర్భాల్లో అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని, ఊహాగానాల ఆధారంగా పరీక్ష రద్దు కోరుతూ వేసిన పిటిషన్లను తిరస్కరించాలని అభ్యర్థించింది. అప్పుడే న్యాయబద్ధంగా పరీక్ష రాసిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బంది కలగదని పేర్కొంది. పరీక్షలో మోసాలకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యల కోసం ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పరీక్ష నిర్వహణను పారదర్శకంగా చేపట్టామని, అక్రమాలు చోటుచేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఎన్‌టీఏ వివరించింది.ఈ వ్యవహారంలో ఈ నెల 8న అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.


నీట్‌ లీక్‌లో ఆధారాలుంటే నన్ను అరెస్టు చేయండి
- నీతీశ్‌ సర్కారుకు తేజస్వి సవాల్‌

పట్నా: నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంలో తనకు సంబంధమున్నట్లు ఆధారాలంటే అరెస్టు చేయాలని నీతీశ్‌ కుమార్‌ సర్కారుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో వంతెనలు కూలినా, హత్యలు జరిగినా తనపై నింద వేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. పేపర్‌ లీక్‌ కేసులో నిందితునికి తేజస్వీతో సంబంధాలున్నట్లు జేడీయూ-భాజపా సర్కారు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. 


‘ఎఫ్‌ఎంజీఈ’ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు 
- ఎన్‌బీఈ హెచ్చరిక

దిల్లీ: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు భారత్‌లో సేవలందించేందుకు అవసరమయ్యే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) అర్హత పరీక్ష శనివారం(జులై 6) నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ప్రశ్నాపత్రాన్ని అందజేస్తామని సోషల్‌ మీడియాలో వస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌(ఎన్‌బీఈ) పేర్కొంది. అవన్నీ మోసపూరిత ప్రకటనలని, కేవలం డబ్బుల కోసమే కొందరు అటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని