పసిమొగ్గల్ని నులిమేస్తున్న వాతావరణ మార్పులు!

వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్‌ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది.

Updated : 06 Jul 2024 04:52 IST

దిల్లీ: వాతావరణ మార్పుల కారణంగా ఉత్పన్నమవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర చలి.. అల్ప, మధ్యాదాయ దేశా (ఎల్‌ఎంఐసీ)ల్లోని చిన్నారుల పాలిట శాపమవుతున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. అక్కడ జరిగే నవజాత శిశు మరణాల్లో 4 శాతానికి పైగా.. ఇవే కారణమవుతున్నాయని పేర్కొంది. జర్మనీలోని పాట్స్‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ 

క్లైమేట్‌ ఇంపాక్ట్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు 2001 నుంచి 2019 మధ్య 29 దేశాల్లో ఈ పరిశోధన చేశారు. దీని ప్రకారం.. 

  • వాతావరణ మార్పులతో చోటుచేసుకుంటున్న ఎల్‌ఎంఐసీ దేశాల్లో జరుగుతున్న మరణాల్లో 1.5 శాతం వరకూ తీవ్ర ఉష్ణోగ్రతలే కారణమవుతున్నాయి. మిగతా 3 శాతం మంది తీవ్ర చలి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
  • తీవ్ర వేడితో జరిగే నవజాత శిశు మరణాల్లో 32 శాతం.. వాతావరణ మార్పులతోనే సంభవిస్తున్నాయి. 2001-2019 మధ్య ఇలా 1.75 లక్షల మంది పసిపిల్లలు చనిపోయారు. 
  • మరోపక్క.. తీవ్ర చలి వల్ల జరిగే నవజాత శిశు మరణాలను 30 శాతం మేర తగ్గించడానికి కూడా వాతావరణ మార్పులే కారణం కావడం గమనార్హం. 
  • పరిశీలన సాగించిన 29 దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏటా సరాసరిన 0.9 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే. 
  • భూతాపం వల్ల తలెత్తుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలతో నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 
  • మొత్తంమీద పసిపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్, మాలి, సియెర్రా లియోన్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రతి లక్ష జననాల్లో దాదాపు 160 మంది శిశువులు అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ప్రాణాలు కోల్పోతున్నారు. 
  • నవజాత శిశువుల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించుకునే సామర్థ్యం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదు. వారిలో జీవక్రియ అధికంగాను, చెమటను విడుదల చేసే సామర్థ్యం తక్కువగాను ఉంటుంది. ఫలితంగా ఉష్ణ ప్రభావం సరిగా తగ్గదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని