మహువాపై ఎఫ్‌ఐఆర్‌కు ఎన్సీడబ్ల్యూ ఆదేశం

జాతీయ మహిళా కమిషన్‌(ఎన్సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్‌’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Published : 06 Jul 2024 04:39 IST

ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలోనే

దిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌(ఎన్సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్‌’లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్సీడబ్ల్యూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి మహువాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు రేఖాశర్మ వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి గొడుగు పడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన మహువా ‘ఆమె తన యజమాని పైజామాను ఎత్తి పట్టుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు’ అని వ్యాఖ్యను జోడించారు. ఆ తరువాత తన వ్యాఖ్యను తొలగించారు. ‘మహిళల గౌరవానికి భంగం కలిగించే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. ‘భారతీయ న్యాయ సంహిత-2023’లోని సెక్షన్‌ 79 ప్రకారం మహువాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఎన్సీడబ్ల్యూ ‘ఎక్స్‌’ వేదికగా ఆదేశించింది. దీనిపై మహువా ఘాటుగా స్పందించారు. ‘‘దిల్లీ పోలీసులూ.. మూడు రోజుల్లో మీరు నన్ను అరెస్టు చేయాలనుకుంటే నదియాకు రండి. నేను ఇక్కడే ఉన్నాను. అన్నట్లు.. నా గొడుగు నేనే పట్టుకోగలను’’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రేఖాశర్మ గతంలో పలువురు రాజకీయ నేతలు, మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్లను షేర్‌ చేసిన మహువా.. రేఖాశర్మపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని దిల్లీ పోలీసులను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని