పేపర్‌ లీక్‌ ఆరోపణలు.. ప్రిన్సిపల్‌ను కుర్చీలోంచి బయటకు లాగేసిన సిబ్బంది

పేపర్‌ లీక్‌ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్‌ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్‌ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు.

Published : 07 Jul 2024 06:34 IST

ప్రయాగరాజ్‌: పేపర్‌ లీక్‌ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఓ ప్రిన్సిపల్‌ను సిబ్బంది అంతా కలిసి బయటకు తోసేశారు. ఆమె ఫోన్‌ లాగేసుకొని, కుర్చీ నుంచి లేపి, బలవంతంగా బయటకు పంపారు. విద్యాసంస్థ ఛైర్మన్‌ కూడా సిబ్బందితో జతకలిశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరిలో జరిగిన యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్‌- అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన బిషప్‌ జాన్సన్‌ బాలికల పాఠశాలపై ఆరోపణలొచ్చాయి. పరీక్ష ప్రారంభం కావడానికి ముందు పేపర్‌ లీక్‌ జరిగిందని అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఆ విద్యాసంస్థకు చెందిన ఉద్యోగి వినీత్‌ జశ్వంత్‌ను అదుపులోకి తీసుకుంది. ఆ వ్యవహారంలో ప్రిన్సిపల్‌ పారుల్‌ పాత్ర కూడా ఉందని యాజమాన్యం ఆరోపించింది. దాంతో ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్‌గా షిర్లే మాస్సేను నియమించింది. షిర్లే రావడం చూసిన పారుల్‌ ప్రిన్సిపల్‌ గదికి వెళ్లి గడియపెట్టుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత మిగతా సిబ్బంది తలుపు తెరిచి, ఆ గది నుంచి ఆమెను బయటకు పంపారు. ఆ క్రమంలో ఆమె ఫోన్‌ తీసేసుకున్నారు. కుర్చీతో సహా ఆమెను పక్కకు లాగేశారు. తర్వాత షిర్లే వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ ఘటనపై పారుల్‌.. పోలీసు కేసు పెట్టారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు పలువురు సిబ్బందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని