లోకోపైలట్లతో రాహుల్‌ భేటీపై వివాదం

రైల్వే డ్రైవర్ల (లోకోపైలట్ల)తో లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ భేటీఅయి వారి సమస్యలపై చర్చించడం కాస్త వివాదానికి తావిచ్చింది. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాహుల్‌తో మాట్లాడిన డ్రైవర్లంతా బయటివారేనని,

Published : 07 Jul 2024 04:39 IST

దిల్లీ: రైల్వే డ్రైవర్ల (లోకోపైలట్ల)తో లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ భేటీఅయి వారి సమస్యలపై చర్చించడం కాస్త వివాదానికి తావిచ్చింది. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాహుల్‌తో మాట్లాడిన డ్రైవర్లంతా బయటివారేనని, వారిలో దిల్లీ డివిజన్‌కు చెందినవారు ఎవరూ లేరని రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కడైనా రైల్వే డ్రైవర్ల సమస్యలు ఒకటేనని, విధి నిర్వహణలో భాగంగా వారు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లడం, అక్కడ విశ్రాంతి తీసుకోవడం మామూలేనని రైల్వే ఉద్యోగ సంఘాలు దానిని తోసిపుచ్చాయి. అన్నిచోట్లా ఒకేతరహా ఇబ్బందులు ఉన్నప్పుడు డివిజన్లు, జోన్లపరంగా విభజన ఎందుకని ‘ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌’ దక్షిణ మండలి అధ్యక్షుడు ఆర్‌.కుమరేశన్‌ ప్రశ్నించారు. దిల్లీకి చెందినవారితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లతోనూ రాహుల్‌ మాట్లాడారని చెప్పారు. సెలవులు లేకపోవడం, భోజన విరామ సమయం ఇవ్వకపోవడం, విశ్రాంతి గదుల్లో సదుపాయాల కొరత, సుదీర్ఘ పనివేళలు వంటివి అన్నిచోట్లా ఉన్నాయని, ఏ డివిజన్‌కు చెందినవారితో చర్చించారనేది అనవసరమని అన్నారు. విపక్షనేతగా ఉన్న ఎంపీని రైల్వే ఉద్యోగులు సహా ఎవరైనా కలవొచ్చని ‘ఇండియన్‌ రైల్వే లోకోరన్నింగ్‌ మెన్‌ ఆర్గనైజేషన్‌’ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌ పాంధీ చెప్పారు. రాహుల్‌కి తాము సమస్యలు చెప్పిన వెంటనే రైల్వేమంత్రిత్వ శాఖ అధికారులు వచ్చి మాట్లాడారని, ఇలాంటి స్పందన తొలిసారి చూశామని కమలేశ్‌ సింగ్‌ అనే మరోనేత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని