సీసీటీవీల అవినీతి కేసులో మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై దర్యాప్తు

దేశ రాజధాని దిల్లీ నగరంలో సీసీటీవీల ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అనుమతించారు.

Published : 07 Jul 2024 04:40 IST

అనుమతించిన దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నగరంలో సీసీటీవీల ఏర్పాటులో అవినీతి జరిగిందనే ఆరోపణలకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌పై దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అనుమతించారు. విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ చేసిన ప్రతిపాదనకు సక్సేనా శనివారం ఈ మేరకు ఆమోదం తెలిపారు. దిల్లీ పరిధిలోని 70 నియోజకవర్గాల్లో సీసీటీవీలను అమర్చేందుకు రూ.571 కోట్ల వ్యయంతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. దీని అమలులో తీవ్ర జాప్యానికి గాను సంబంధిత కంపెనీకి రూ.16 కోట్ల జరిమానా విధించగా...దానిని మాఫీ చేయించేందుకు అప్పటి ప్రజాపనుల శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ రూ.7 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపణ. ఈ అవినీతిపై 2019 సెప్టెంబరులోనే ఫిర్యాదు వచ్చిందని, విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ ప్రతిపాదనతో దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇప్పుడు అనుమతించారని రాజ్‌ నివాస్‌ వర్గాలు తెలిపాయి. 2022 మే నెలలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు అయిన సత్యేందర్‌ జైన్‌ ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తునకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతివ్వడంపై ఆప్‌ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్‌ను అంతమొందించాలనే కుట్రలో భాగంగానే తమ పార్టీ అగ్రనేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అవినీతిపరుడైన సత్యేందర్‌పై ఇదివరకే ఈ దర్యాప్తు జరగాల్సిందంటూ భాజపా నేతలు ప్రతిస్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు