తేలికపాటి స్వదేశీ యుద్ధ ట్యాంకు సిద్ధం

తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్‌’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి.

Published : 07 Jul 2024 06:33 IST

దిల్లీ: తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ ట్యాంకు ‘జొరావర్‌’ సిద్ధమైంది. తాజాగా దీనిపై పరీక్షలు మొదలయ్యాయి. ఈ ట్యాంకును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- (డీఆర్‌డీవో), ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా రూపొందించాయి. 

25 టన్నుల బరువుండే జొరావర్‌ ట్యాంకును వాయు మార్గంలోనూ రవాణా చేయవచ్చు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి శరవేగంగా మోహరించేందుకు వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు. డ్రాగన్‌ కూడా ఇలాంటి ట్యాంకులను అక్కడ రంగంలోకి దించడంతో వీటి రూపకల్పనకు మన దేశం పూనుకుంది. 350కిపైగా జొరావర్‌ ట్యాంకులను మోహరించాలని భారత సైన్యం భావిస్తోంది. ప్రధానంగా పర్వతమయ సరిహద్దు ప్రాంతంలో వీటిని రంగంలోకి దించాలనుకుంటోంది. 

జొరావర్‌ ట్యాంకును రికార్డు స్థాయిలో కేవలం రెండేళ్లలోనే వాటిని డీఆర్‌డీవో, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు అభివృద్ధి చేశాయి. దీనికి గుజరాత్‌లోని హజీరాలోని ఎల్‌ అండ్‌ టీ కర్మాగారంలో ప్రాథమిక పరీక్షలు జరిగాయి. తాజాగా ఈ ఫ్యాక్టరీని డీఆర్‌డీవో అధిపతి సమీర్‌ కామత్‌ సందర్శించి, ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ట్యాంకులను 2027లో సైన్యంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ‘‘ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. పరీక్షలో భాగంగా జోరావర్‌ చేస్తున్న విన్యాసాలు చూడటం నాకు ఆనందంతో పాటు గర్వంగా ఉంది. డీఆర్‌డీవో, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేస్తే ఏం సాధిస్తామో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాబోయే ఆరు నెలల్లో ఈ యుద్ధ ట్యాంకు పరీక్షలు కొనసాగుతాయి. అనంతరం క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి దాన్ని సైన్యానికి అందజేస్తాం’’ అని ఆయన తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలతో జొరావర్‌ తేలికపాటి యుద్ధ ట్యాంకులో అన్‌ మ్యాన్డ్‌ సర్ఫేస్‌ వెహికిల్‌ అనే సాంకేతికతను జోడించారు. మానవ ప్రమేయం లేకున్నా పని చేసే విధంగా రూపొందించారు.

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని