సంక్షిప్త వార్తలు

వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్‌ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 07 Jul 2024 04:45 IST

అనధీకృత వ్యక్తులు గ్రేడింగ్‌ చేస్తే జరిమానా 
నోటిఫికేషన్‌ జారీచేసిన కేంద్ర వ్యవసాయశాఖ

ఈనాడు, దిల్లీ: వ్యవసాయ మార్కెట్లలో అనధీకృత వ్యక్తులు వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్‌ పనులు చేస్తే జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తప్పుడు గ్రేడింగ్, మార్కింగ్‌ చేసి విక్రయాలు జరిపినా బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి జనరల్‌ గ్రేడింగ్‌ అండ్‌ మార్కింగ్‌ సవరణ నిబంధనలు-2024 పేరుతో కేంద్ర వ్యవసాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల (గ్రేడింగ్, మార్కెటింగ్‌)యాక్ట్‌ 1937 పరిధిలోకి వచ్చే ఉత్పత్తుల గ్రేడింగ్, మార్కింగ్‌ పనులను అనధీకృత వ్యక్తులు/సంస్థలు చేపడితే జరిమానా విధించాలని కొత్తగా నిర్ణయించారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు తప్పుడు గ్రేడింగ్, మార్కింగ్‌ చేసి విక్రయించినా జరిమానా విధించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులపై కేంద్రం నియమించిన విచారణ అధికారి పరిశీలించి నిర్ణయం వెలువరిస్తారు. గ్రేడింగ్, మార్కింగ్‌ల్లో తప్పులు చేసినట్లు తేలితే అందుకు బాధ్యులైన వారిపై ఆ చర్య ద్వారా వారు పొందిన అనుచిత లబ్ధిని కానీ, రైతులకు జరిగిన నష్టం మొత్తాన్ని కానీ జరిమానాగా విధిస్తారు. విచారణ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే అవి వెలువడిన 30 రోజుల్లోపు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వైజర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు.


కేరళలో మరో ‘మెదడును తినే అమీబా’ కేసు

 కోజికోడ్‌: కేరళలో ‘మెదడును తినే అమీబా (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌)’ కేసు మరోటి బయటపడింది. ఉత్తర కేరళలోని పియోలిలో 14 ఏళ్ల బాలుడు ఈ అరుదైన వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరినట్లు శనివారం అధికారులు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఈ తరహా కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. బాలుడు ఈ నెల 1న ఆసుపత్రిలో చేరాడని, ప్రస్తుతం అతని ఆరోగ్యం మెరుగవుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కలుషిత జలాల్లో ఉండే అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు అమీబిక్‌ మెనింజో   ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధి సోకుతుంది. ఈ నెల 3న ఇదే వ్యాధి సోకి 14 ఏళ్ల బాలుడు, మేలో ఓ ఐదేళ్ల బాలిక, జూన్‌లో మరో 13 ఏళ్ల బాలిక ఇదే వ్యాధితో మరణించడం గమనార్హం. వరుస వ్యాధి ఘటనలతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శుక్రవారం ఉన్నత స్థాయి వైద్యాధికారులతో సమావేశమయ్యారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుండటంతో నీటికుంటల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ మరింత శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.


వీటిని కొనలేరు.. దానంగా పొందలేరు

మయం, ఆరోగ్యం, స్వేచ్ఛ, బంధాలు.. ఇవి జీవితంలో అమూల్యమైనవి. డబ్బుతో విలాసాలు కొనొచ్చు కానీ, వీటిని మాత్రం కొనలేం. ఇతరులు మనకు అవయవదానమైనా చేయగలరు కానీ, వారి సమయాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను దానంగా ఇవ్వలేరు. విచిత్రం ఏంటంటే అవి మన దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. అసలు మనం వాటిని అనుభవిస్తున్నట్లు కూడా గుర్తించలేం. కానీ వాటిని కోల్పోయాకే తెలుస్తుంది ఎంత నష్టపోయామో. అందుకే వాటిని దుర్వినియోగం చేసుకోకండి. 

మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ సహ వ్యవస్థాపకులు మోతీలాల్‌ 


బిహార్‌లో పిడుగుపాటుకు తొమ్మిది మంది మృతి

పట్నా: బిహార్‌లో పిడుగుపాటుకు గురై తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు శనివారం అధికారులు తెలిపారు జహానాబాద్‌ జిల్లాలో ముగ్గురు, మధేపురాలో ఇద్దరు, తూర్పు చంపారణ్, రోహ్‌తాస్, సారణ్, సుపొల్‌ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతిచెందినట్లు పేర్కొన్నారు. 


అగ్నిపథ్‌ వయోపరిమితిని 23కు పెంచాలి: ఆర్మీ

దిల్లీ: అగ్నిపథ్‌లో చేరేవారి వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మంది అగ్నివీర్‌లను కొనసాగించాలని కేంద్రాన్ని సైన్యం కోరనున్నట్లు తెలుస్తోంది. మూడు సర్వీసులలో సాంకేతిక ఉద్యోగాల్లో పనిచేయడం కోసం నియమించే గ్రాడ్యుయేట్ల వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచాలని, ప్రత్యేక ప్రాంతాల్లో మానవ వనరుల కొరతను దృష్టిలో ఉంచుకుని కనీసం 50 శాతం అగ్నివీరులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బలగాలు కేంద్రానికి నివేదించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోరాట ప్రతిభను పెంచడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని ఓ సైన్యాధికారి పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితం  ప్రవేశపెట్టిన ఈ పథకంలో 17 నుంచి 21 ఏళ్లు మధ్య ఉన్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన అనంతరం సర్వీస్‌ నుంచి తప్పుకున్న అగ్నివీర్‌లకు ఎటువంటి ఆర్థిక సాయం, పెన్షన్‌ సౌకర్యాలు ఉండవు. వారిలో 25శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు రెగ్యులర్‌ సర్వీస్‌లో కొనసాగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని