Security tightened in Manipur ahead of Rahuls visit: మణిపుర్‌కు రాహుల్‌.. ప్రతిపక్ష నేతగా తొలిసారి

సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌ గాంధీ మణిపుర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Published : 07 Jul 2024 22:14 IST

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఇటీవల మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు రెండు పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతో పాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. మరోవైపు.. కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ పరిణామాల నడుమ.. మణిపుర్‌ సందర్శనకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఆ రాష్ట్రానికి వెళ్లనుండటం ఇదే తొలిసారి.

‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్‌పై మండిపడ్డ శిందే!

ముందుగా రాహుల్‌ గాంధీ దిల్లీ నుంచి సిల్చార్‌కు చేరుకుంటారు. అనంతరం చురాచంద్‌పుర్‌కు బయల్దేరుతారు. గతేడాది హింస చెలరేగినప్పటి నుంచి రాహుల్‌ గాంధీ ఈ రాష్ట్రాన్ని రెండు సార్లు సందర్శించారు. దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ కార్యకలాపాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.

మణిపుర్‌లో శాంతిభద్రతల పునరుద్ధరణను కాంక్షిస్తూ పర్యటన చేపట్టాలని రాహుల్‌ నిర్ణయించుకున్నట్లు స్థానిక కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ.. మణిపుర్‌ అంశాన్ని లేవనెత్తారు. అల్లర్లతో ఆ రాష్ట్రంలో అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదని విమర్శలు గుప్పించారు.

అంతకుముందు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సైతం మణిపుర్‌ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని కోరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమ రాహుల్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని