సంక్షిప్త వార్తలు

జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 08 Jul 2024 04:23 IST

మహువాపై ఎఫ్‌ఐఆర్‌

దిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎన్‌సీడబ్ల్యూ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 79 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


హాథ్రస్‌ బాధితులకు పరిహారం పెంచండి
యూపీ సీఎంకు రాహుల్‌గాంధీ లేఖ

దిల్లీ: హాథ్రస్‌ తొక్కిసలాట బాధితులకు పరిహారం పెంచాలని కోరుతూ ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆదివారం లేఖ రాశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. పరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని కోరారు. భోలే బాబా సత్సంగ్‌ సందర్భంగా మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని శుక్రవారం రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆదివారం లేఖ రాశారు. మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సహాయాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ‘121 మంది చనిపోయిన ఘటనతో నేను షాక్‌కు గురయ్యా. ఎంతో బాధతో ఈ లేఖ రాస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. దానిని పెంచండి’ అని లేఖలో రాహుల్‌ కోరారు.


జనంపై విషం చల్లారు
భోలే బాబా న్యాయవాది ఆరోపణ

దిల్లీ: హాథ్రస్‌లోని ఫుల్‌రయీలో తొక్కిసలాటకు ముందు కొంత మంది క్యాన్లలో విషం తెచ్చి జనంపై చల్లారని భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఆరోపించారు. భోలే బాబాను ఇరికించేందుకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. ఆదివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘15 నుంచి 16 మంది క్యాన్లలో విషం తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు నాకు తెలిపారు. తొక్కిసలాట మృతుల పోస్టుమార్టం నివేదికలను నేను చూశా. ఎవరూ గాయాలతో చనిపోలేదు. అందరూ ఊపిరాడక మరణించారు. ఘటనా స్థలివద్ద నిందితులు పారిపోవడానికి వాహనాలనూ సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. దానికి సంబంధించిన ఆధారాలు మావద్ద ఉన్నాయి. వాటిని మేం కోర్టుకు సమర్పిస్తాం’ అని ఏపీ సింగ్‌ వివరించారు.


అవసరమైతే ఎవరినైనా ప్రశ్నిస్తాం
- న్యాయ విచారణ కమిషన్‌ వెల్లడి

నొయిడా: హాథ్రస్‌ తొక్కిసలాటకు సంబంధించి అవసరమైతే ఎవరినైనా ప్రశ్నిస్తామని న్యాయ విచారణ కమిషన్‌ స్పష్టం చేసింది. భోలే బాబా కూడా ఇందుకు మినహాయింపు కాదని తేల్చి చెప్పింది. ఈ కమిషన్‌కు అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బ్రిజేశ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్యుడిగా ఐఏఎస్‌ మాజీ అధికారి హేమంత్‌ రావు ఉన్నారు. ఆదివారం హాథ్రస్‌లో పర్యటించిన హేమంత్‌ రావు వివరాలను సేకరించారు. 


బిహార్‌లో పిడుగుపాటుకు 10 మంది మృతి

పట్నా: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బిహార్‌ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40మంది మృతిచెందగా.. తాజాగా మరో 10 మంది బలయ్యారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఐదు జిల్లాల్లో పిడుగులు పడిన ఘటనల్లో పది మంది మృత్యువాత పడినట్లు బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కార్యాలయం వెల్లడించింది.


సూరత్‌ ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య
- భవన యజమానులపై కేసు నమోదు, అదుపులో ఒకరు

సూరత్‌: గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. రాత్రంతా శ్రమించి మరో ఆరుగురి మృతదేహాలను శిథిలాల్లోంచి వెలికితీసినట్లు ఆదివారం పోలీసులు వెల్లడించారు. నివాసితుల నుంచి అద్దె వసూల చేసే అశ్విన్‌ వెకరియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతనితోపాటు భవన యజమానులైన రాజ్‌ కకాదియా, అతని తల్లి రామిలాబేన్‌ కకాదియాలపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. రాజ్‌ కకాదియా ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతులను దాదాపు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఫ్యాక్టరీ కార్మికులుగా గుర్తించారు. సూరత్‌లోని పాల్‌ ప్రాంతంలో 2016లో నిర్మించిన ఈ భవనం భారీ వర్షాలతో శనివారం కూలిపోయింది. అప్రమత్తమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఒకరి మృతదేహాన్ని వెలికి తీశాయి. 20 ఏళ్ల అమ్మాయిని కాపాడాయి. మరో 15మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


వాయుసేనకు నిఘా ఉపగ్రహాల సరఫరా
పిక్సెల్‌ సంస్థ వెల్లడి 

దిల్లీ: వచ్చే ఏడాది మధ్య నాటికి భారత వైమానిక దళానికి ఉపగ్రహాలను సరఫరా చేస్తామని అంతరిక్ష అంకుర పరిశ్రమ ‘పిక్సెల్‌’ పేర్కొంది. దీనివల్ల దేశ సరిహద్దులు, ఆ వెలుపలి ప్రాంతాలపై నిఘా పెట్టే సామర్థ్యం మన దేశానికి మరింత పెరుగుతుందని వివరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్‌ సంస్థను యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అవాయిజ్‌ అహ్మద్, క్షితిజ్‌ ఖండేల్‌వాల్‌లు ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని