ఖల్సా రాజ్‌ కలలు కనడం నేరం కాదు

‘ఖల్సా రాజ్‌’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్‌ సాహిబ్‌ పార్లమెంటు సభ్యుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అన్నారు.

Published : 08 Jul 2024 04:24 IST

ఖడూర్‌ సాహిబ్‌ ఎంపీ అమృత్‌పాల్‌ సింగ్‌

చండీగఢ్‌: ‘ఖల్సా రాజ్‌’ కలలను నిజం చేసుకునేందుకు లక్షలాది సిక్కులు తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ విధమైన కలలు కనడం నేరం కాదని సిక్కు అతివాద బోధకుడు, ఖడూర్‌ సాహిబ్‌ పార్లమెంటు సభ్యుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అన్నారు. ఇది తమకెంతో గర్వకారణమని, ఆ మార్గం నుంచి పక్కకు వెళ్లాలని కూడా అనుకోవడం లేదని చెప్పారు. ‘‘నా కుమారుడు ఖలిస్థాన్‌ మద్దతుదారు కాదు’’ అంటూ తన తల్లి చేసిన ప్రకటనతో ఆయన విభేదించారు. ‘‘అమ్మ నిన్న చేసిన ఈ ప్రకటన నన్ను బాధపెట్టింది. ఆమె అవగాహన లేకే అలా మాట్లాడిందని తెలిసినా.. నా కుటుంబం నుంచి, మద్దతుదారుల నుంచీ అటువంటి ప్రకటన ఎన్నడూ రాకూడదు’’ అని అమృత్‌పాల్‌ పేర్కొన్నట్లు ఆయన ప్రతినిధి బృందం శనివారం రాత్రి ఓ ప్రకటనను చదివి వినిపించింది. ఆ సందర్భంగా అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తల్లి బల్వీందర్‌ కౌర్‌.. ‘‘అమృత్‌పాల్‌ ఖలిస్థాన్‌ మద్దతుదారు కాదు. తక్షణం అతణ్ని జైలు నుంచి విడుదల చేసి, తనను ఎన్నుకొన్న ప్రజల సమస్యలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. కుమారుడి మనోగతం గ్రహించాక  బల్వీందర్‌ మాట మార్చారు. మీడియా తన మాటలను వక్రీకరించిందంటూ ఓ వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని