నీట్‌-యూజీపై నేటి నుంచి సుప్రీంలో విచారణ

వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

Published : 08 Jul 2024 04:24 IST

మొత్తం 38 పిటిషన్లపై వాదనలు విననున్న సీజేఐ ధర్మాసనం

దిల్లీ: వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌-యూజీ 2024పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం వీటిపై వాదనలు విననుంది. ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పెద్దయెత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పిటిషన్లపై ఇప్పటికే జాతీయ పరీక్షా మండలి (ఎన్‌టీఏ), కేంద్ర విద్యాశాఖ ప్రమాణ పత్రాలు దాఖలు చేశాయి. పరీక్ష రద్దుచేస్తే నిజాయతీగా రాసిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని పేర్కొన్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున పరీక్ష రద్దు చేయకూడదని తమ స్పందనల్లో పేర్కొన్నాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిలుపుదల చేయాలని వేసిన పిటిషన్లపై స్టే ఇవ్వడానికి గత నెల 21న సుప్రీంకోర్టు నిరాకరించింది. పెండింగ్‌ పిటిషన్లపై తీర్పునకు లోబడి ప్రవేశ ప్రక్రియ ఉంటుందని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం మే 5న ఎన్‌టీఏ నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో జరిగింది. 23 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని