ఉత్తర భారతంలో తరుగుతున్న పాతాళగంగ

ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 08 Jul 2024 04:26 IST

2 దశాబ్దాల్లో 450 చదరపు కిలోమీటర్ల భూగర్భ జలాలు ఆవిరి!
తాజా అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: ఉత్తర భారత దేశం.. 2002 నుంచి 2021 మధ్య దాదాపు 450 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర భూగర్భ జలాలను కోల్పోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. ఇది దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్‌ అయిన ఇందిరా సాగర్‌ డ్యామ్‌ (మధ్యప్రదేశ్‌) గరిష్ఠ నిల్వ సామర్థ్యం కన్నా 37 రెట్లు ఎక్కువ కావడం విశేషం. వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లలో ఈ క్షీణత తీవ్రం కానుందని పరిశోధకులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలు, ఉపగ్రహ డేటా, ఇతర నమూనాలను ఉపయోగించి హైదరాబాద్‌లోని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ), గాంధీనగర్‌ ఐఐటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 

  • 1951-2021 మధ్య వర్షాకాలంలో (జూన్‌ నుంచి సెప్టెంబరు) ఉత్తరాదిన వానలు 8.5 శాతం మేర తగ్గాయి. మరోపక్క శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0.3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయి. ఈ రెండు అంశాల వల్ల సాగునీటికి డిమాండ్‌ పెరిగింది. దీంతో భూగర్భ జలాల రీఛార్జి తగ్గిపోయింది. ఉత్తర భారత దేశంలో అప్పటికే క్షీణించిన భూగర్భ జలాలపై ఇది భారాన్ని మరింత పెంచింది. 
  • వర్షాలు సరిగా పడకుంటే పంటల కోసం భూగర్భజలాలపై ఆధారపడటం పెరుగుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నేల పొడిబారుతుంది. ఫలితంగా సాగునీటి అవసరం మరింత పెరుగుతుంది. 2022 నాటి చలికాలంలో ఈ పోకడ కనిపించింది. ఆ సీజన్‌.. 1901 నుంచి అత్యంత ఉష్ణమయ శీతాకాలాల్లో ఐదోస్థానంలో నిలిచింది. 
  • వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అది పెను తుపాన్లు వంటి అసాధారణ ఘటనల రూపంలోనే సంభవిస్తుంది. అవి భూగర్భ జలాలను పెంచడానికి దోహదపడవు. అందువల్ల పాతాళ గంగ తగ్గుదల పోకడ భవిష్యత్‌లోనూ కొనసాగనుంది. 
  • భూగర్భజలాలు రీఛార్జి కావాలంటే తక్కువ స్థాయి వర్షాలు అనేక రోజుల పాటు కురవాలి. 
  • 2009లో వర్షాకాలంలో సాధారణం కన్నా 20 శాతం మేర పొడి వాతావరణం ఉంది. ఆ తర్వాత శీతాకాలంలో ఒక డిగ్రీ మేర ఉష్ణోగ్రత పెరిగింది. ఫలితంగా ఉత్తర భారత దేశంలో భూగర్భజలాల నిల్వలు 10 శాతం మేర తగ్గిపోయాయి. 
  • గత నాలుగు దశాబ్దాల్లో శీతాకాలాల్లో నేల నుంచి తేమ ఆవిరికావడం ఎక్కువైంది. దీన్ని బట్టి భూతాపం, సాగునీటి డిమాండ్‌ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. 
  • భూతాపం ఇలాగే పెరిగి.. వర్షాకాలాలు 10-15 శాతం మేర పొడిగా ఉండి, శీతాకాలాల్లో 1-5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే.. సాగునీటి డిమాండ్‌ 6-20 శాతం పెరుగుతుంది. 
  • ఉత్తర భారత దేశమంతటా ఉష్ణోగ్రతలు 1-3 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగితే భూగర్భ జలాలు 7-10 శాతం మేర తగ్గుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని