సంక్షిప్త వార్తలు

బ్రెజిల్‌ నగరాలైన రియో,  సావో పాలోలకు సంబంధించి గొప్ప విషయం ఏంటో తెలుసా? పౌరులు సులువుగా నడిచి వెళ్లేందుకు, సైకిళ్లపై ప్రయాణించేందుకు వీలుగా వాటిని తీర్చిదిద్దారు.

Published : 09 Jul 2024 03:39 IST

 బ్రెజిల్‌ నగరాలను చూసి భారతీయులు నేర్చుకోవాలి 

బ్రెజిల్‌ నగరాలైన రియో,  సావో పాలోలకు సంబంధించి గొప్ప విషయం ఏంటో తెలుసా? పౌరులు సులువుగా నడిచి వెళ్లేందుకు, సైకిళ్లపై ప్రయాణించేందుకు వీలుగా వాటిని తీర్చిదిద్దారు. కార్ల కోసం కాకుండా ప్రజల కోసం అభివృద్ధి చేశారు. అవి చాలా నివాసయోగ్యమైనవి. భారతీయులు వాటి నుంచి    నేర్చుకోవాలి. నగరాల్లో నడక, సైక్లింగ్‌ దారులను ఏర్పాటుచేయాలి. 

అమితాబ్‌ కాంత్, నీతీ ఆయోగ్‌ మాజీ సీఈవో


జీవితాన్ని సాహసయాత్రగా భావించండి

జీవితాన్ని ఓ సాహసయాత్రగా భావిస్తే.. మీరెప్పుడూ ఉత్సాహాన్ని కోల్పోరు. తప్పు మార్గంలో ప్రయాణించరు. అనవసరంగా ఇరుక్కుపోయాననే భావన ఎన్నటికీ కలగదు. అలా కాకుండా జీవితాన్ని.. తప్పు/ఒప్పు సమాధానాలు ఉండే గణిత శాస్త్రంలోని ఆప్టిమైజేషన్‌ సమస్యగా మాత్రమే భావిస్తే నైరాశ్యం ఆవహిస్తుంది. అంతా సాదాసీదాగా నడిచిపోతుంది. 

 పారస్‌ చోప్రా, వ్యాపారవేత్త


వ్యవస్థలో అవినీతితో.. కూలుతున్న వంతెనలు

బిహార్‌లో ఇటీవలి కాలంలో దాదాపు    12 వంతెనలు కూలిపోయాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో ఒక బ్రిడ్జి పడిపోయింది. గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలడం ఎంతటి పెను విషాదానికి దారితీసిందో ఇప్పుడప్పుడే మరిచిపోలేం. నిర్మాణాలకు నాసిరకం సామగ్రిని ఉపయోగించడం, రాజకీయ నాయకులతో బిల్డర్లకు ఉన్న అనుచిత సన్నిహిత సంబంధాలు, టెండర్ల వ్యవస్థలో లోపాలు, భద్రతా ప్రమాణాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం వంటివి ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. వ్యవస్థలో అవినీతి        బాగా పేరుకుపోయింది.

సబా నక్వీ, రాజకీయ విశ్లేషకురాలు


సహాయం, సలహా అంటే..

సహాయం అంటే- మీ వద్ద సమాధానం లేనప్పుడు మీరు ఇతరుల నుంచి కోరేది. సలహా అంటే- మీకు సమాధానం తెలిసినప్పటికీ.. మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందో తెలుసుకునేందుకు అడిగేది.

అంకుర్‌ వారికూ, వ్యాపారవేత్త 


14% పెరిగిన ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం

వరి సాగు 19%, పప్పుదినుసులు 54% వృద్ధి
చిరుధాన్యాల్లో 29% తగ్గుదల

ఈనాడు, దిల్లీ: ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం గత ఏడాదికంటే 14.10% పెరిగినట్లు కేంద్ర వ్యవసాయశాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జులై 8 నాటికి గత ఏడాది 331.90 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈసారి అది 378.72 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు వెల్లడించింది. వరి సాగు విస్తీర్ణం 50.26 లక్షల హెక్టార్ల నుంచి 59.99 లక్షల హెక్టార్లకు (19.35%), పప్పుదినుసులు 23.78 నుంచి 36.81 (54%), నూనెగింజలు 51.97 నుంచి 80.31, చెరకు 55.45 నుంచి 56.88, పత్తి 62.34 నుంచి 80.63 లక్షల హెక్టార్లకు పెరిగినట్లు తెలిపింది. చిరుధాన్యాల సాగు మాత్రం  82.08 లక్షల హెక్టార్ల నుంచి 58.48 లక్షల హెక్టార్లకు (-29%) తగ్గినట్లు వెల్లడించింది.


హరియాణాలో బోల్తాపడ్డ బస్సు

50 మందికి గాయాలు
బాధితుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే

చండీగఢ్‌: హరియాణా రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక మినీ బస్సు సోమవారం పంచకుల జిల్లాలోని పింజోర్‌ వద్ద బోల్తా పడింది. ఫలితంగా 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే. ప్రయాణికుల్లో ఎక్కువమందికి స్వల్పగాయాలే అయ్యాయి. కొండ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.  


నిరంతర నిఘా.. నిందితుడి గోప్యత హక్కు ఉల్లంఘనే

 సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: దర్యాప్తు సంస్థ నిరంతర నిఘాకు వీలుకల్పించేలా నిందితుడికి షరతులతో బెయిల్‌ మంజూరు చేయడం అతని వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాదక ద్రవ్యాల కేసులో నైజీరియా జాతీయుడు ఫ్రాంక్‌ వైటస్‌కు దిల్లీ హైకోర్టు విధించిన అటువంటి బెయిల్‌ షరతును జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం సోమవారం తొలగించింది. తన కదలికలను ఎప్పటికప్పుడు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా తెలుసుకునేలా పోలీస్‌ అధికారికి లొకేషన్‌ షేర్‌ చేయాలని హైకోర్టు ఆదేశించడాన్ని నిందితుడు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడి వ్యక్తిగత జీవితంలోకి నిరంతరంగా తొంగిచూసేలా దర్యాప్తు సంస్థను అనుమతించడం తగదని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అటువంటి షరతు.. అధికరణం 21 ద్వారా రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కుకు విఘాతమని పేర్కొంది. నేర నిరూపణ జరిగే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలని తెలిపింది. షరతులు విధించే సమయంలో న్యాయస్థానాలు సంయమనం పాటించాలని, చట్ట పరిమితులను పాటించాలని సూచించింది. కేసు పరిస్థితిని బట్టి బాధితులు, సాక్షుల రక్షణ నిమిత్తం కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి నిందితుడు ప్రవేశించరాదని షరతు విధించవచ్చని తెలిపింది. అంతేకాని నిందితుడి ప్రతి కదలికపై నిఘా ఉంచేలా పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థకు అనుమతివ్వరాదని స్పష్టం చేసింది. 2014 మే 21న అరెస్టు అయిన ఫ్రాంక్‌ వైటస్‌ 2022 మే 31న షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.


బెంగాల్‌లో వర్సిటీలకు వీసీల సెర్చ్‌ కమిటీ 

 మాజీ సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ను అధ్యక్షుడిగా నియమించిన సుప్రీంకోర్టు 

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల(వీసీ) ఎంపిక, నియామక కమిటీకి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ను సుప్రీంకోర్టు నియమించింది. విశ్వవిద్యాలయాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సమస్య సుప్రీంకోర్టుకు చేరింది. సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం కేసును విచారిస్తూ... ‘‘గవర్నర్‌ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించినందున ఐదుగురు సభ్యులతో కూడిన సెర్చ్‌ కమిటీని రెండు వారాల్లో నియమించాలి. ఈ కమిటీ ప్రతి వర్సిటీకి ముగ్గురు వ్యక్తుల పేర్లను అక్షరక్రమంలో సూచిస్తూ ప్యానల్‌ను సిద్ధం చేస్తుంది. కమిటీ సూచనలు, సిఫార్సులు రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించాలి. కమిటీ సూచించిన వారిలో ఎవరైనా తగినవారు కానట్లు సీఎం గుర్తిస్తే, ఆయా అభ్యంతరాలను గవర్నర్‌కు రెండు వారాల్లో పంపించాలి’’ అని ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కావాలని సూచించింది.


హేమంత్‌ బెయిలును సుప్రీంలో సవాలు చేసిన ఈడీ

దిల్లీ: ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు హైకోర్టు మంజూరు చేసిన బెయిలును సుప్రీం కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సవాలు చేసింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జూన్‌ 28న హైకోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. దీంతో ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రిగా హేమంత్‌ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా హేమంత్‌ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, రాజధాని రాంచీలోని బర్గెయిన్‌ ప్రాంతంలో 8.86 ఎకరాలను చట్ట విరుద్ధంగా సేకరించారని ఈడీ ఆరోపిస్తోంది. 


నిఠారి వరుస హత్యల కేసు... సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటించడంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

దిల్లీ: సంచలన నిఠారి వరుస హత్యల కేసు (2006)లో నిందితుడు సురేంద్ర కోలీని అలహాబాద్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అంగీకరించింది. సీబీఐ పిటిషన్‌పై స్పందన తెలపాలని నిందితుడు సురేంద్ర కోలీని ఆదేశించింది. నిఠారి వరుస హత్యల కేసులో సెషన్స్‌ కోర్టు 2010 సెప్టెంబరు 28న కోలీని దోషిగా తేల్చి మరణ దండన విధించింది. అయితే, అతనిని నిర్దోషిగా ప్రకటిస్తూ 2023 అక్టోబరు 16న అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని