పార్లమెంటులో మీ సైనికుడిని నేను

తాను అస్సాం ప్రజలకు బాసటగా నిలుస్తానని, వారి తరఫున ‘పార్లమెంటులో సైనికుడి’లా వ్యవహరిస్తానని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

Published : 09 Jul 2024 03:45 IST

అస్సాం, మణిపుర్‌ ప్రజలకు బాసటగా నిలుస్తా: రాహుల్‌
పునరావాస శిబిరాల సందర్శన

సిల్చార్, ఇంఫాల్‌: తాను అస్సాం ప్రజలకు బాసటగా నిలుస్తానని, వారి తరఫున ‘పార్లమెంటులో సైనికుడి’లా వ్యవహరిస్తానని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. అస్సాంకు అవసరమైన సాయాన్ని కేంద్రం అందించి, అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. అస్సాంలోని కచార్‌ జిల్లా ఫులెర్తాల్‌లో వరద సహాయక శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు. మణిపుర్‌లో హింసవల్ల నిరాశ్రయులై అస్సాంలోని తలైన్‌లో తలదాచుకున్నవారినీ పరామర్శించారు. మణిపుర్‌లోని జిరీబామ్, చురాచాంద్‌పుర్‌ జిల్లాల్లోనూ ఆయన పర్యటించారు. అనంతరం ‘ఎక్స్‌’లో స్పందించారు. అస్సాంకు తక్షణ సాయంగా పరిహారం ఇవ్వడంతోపాటు దీర్ఘకాలంలో వరదల నివారణకు కావాల్సిన చర్యల్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘వరదలతో అస్సాంకు వాటిల్లిన నష్టం, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం చూశాక నా హృదయం ముక్కలైంది. వరద రహిత అస్సాంను తీసుకువస్తామని హామీ ఇచ్చిన ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారు’ అస్తవ్యస్త పాలనను ఈ సంఖ్యలు చాటుతున్నాయి’’ అని పేర్కొన్నారు. రాహుల్‌కు అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్‌ బోరా స్వాగతం పలికారు. వరదలతో వాటిల్లిన తీవ్రనష్టం గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తగినసాయం మంజూరయ్యేలా చూడాలని కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ బాధితులు తమ అనుభవాలను రాహుల్‌కు వివరించారు. ఆయనను స్వాగతించడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు ఆయనతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దయనీయ పరిస్థితులున్న మణిపుర్‌లో శాంతి నెలకొనడానికి పార్టీపరంగా, విపక్షంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని రాహుల్‌ భరోసా ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రధాని స్వయంగా వచ్చి ప్రజల బాధలు తెలుసుకోవాలని కోరారు. 


పర్యటనకు ముందు కాల్పుల కలకలం

మణిపుర్‌లో పునరావాస శిబిరాలను రాహుల్‌ సందర్శించడానికి ముందు జిరీబామ్‌ జిల్లాలోని గులార్థాల్‌ ప్రాంతంలో మైతేయ్‌ తెగవారు ఉండేచోట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం రేకెత్తించింది. భద్రత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడున్నర గంటలసేపు ఇది కొనసాగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని