సంక్షిప్త వార్తలు (11)

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవే.

Updated : 10 Jul 2024 06:27 IST

13 అసెంబ్లీ సీట్లకు నేడు ఉప ఎన్నికలు

దిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవే. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమలేశ్‌ ఠాకుర్‌ సహా పలువురి భవితను ఇవి తేల్చనున్నాయి. ఎన్నికలు జరగబోతున్న స్థానాల్లో పశ్చిమబెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు; బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. సభ్యుల కన్నుమూత, లేదా రాజీనామాల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 13న చేపట్టనున్నారు.


రాహుల్‌ వ్యాఖ్యలపై  హిందూ సంస్థల ధర్నా

దిల్లీ: ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు మంగళవారం దిల్లీలో ధర్నా చేశారు. సర్వ హిందూ సమాజ్‌ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులను అవమానించడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆరెస్సెస్, వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్, దుర్గావాహిని, హిందూజాగరణ్‌ మంచ్‌ తదితర సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


కేంద్ర ప్రభుత్వ అధికారులకు అనుమానాస్పద ఈమెయిళ్లు! 

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ అధికారులు పలువురికి మంగళవారం ఒకేవిధమైన అనుమానాస్పద ఈమెయిళ్లు వచ్చాయి. వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌ (సీఎస్‌ఎస్‌) అధికారులకు ఇలా మెయిళ్లు అందాయి. ఆయా అధికారుల అధికారిక మెయిల్‌ ఖాతాలు రద్దు కాలేదని నిర్ధారించేందుకు తామిచ్చిన లింకుపై క్లిక్‌ చేయాల్సిందిగా అందులో కోరారు. కేంద్ర సచివాలయంలో పనిచేస్తున్న చాలామంది అధికారులకు ఈవిధమైన అనుమానాస్పద ఈమెయిళ్లు వచ్చినట్లు సీఎస్‌ఎస్‌ అధికారుల ఫోరం తెలిపింది. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)తోపాటు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖలకు వీటిపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. 


సరిహద్దు పన్నుపై హైకోర్టులకు వెళ్లండి
పిటిషనర్లకు ‘సుప్రీం’ స్పష్టీకరణ

దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు అథీకృత రుసుము/ సరిహద్దు పన్నును వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం పరిష్కరించింది. ఉపశమన ఉత్తర్వుల కోసం ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్లకు కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలు తీర్పు చెప్పారు. రవాణా సంస్థలు, టూర్‌ ఆపరేటర్లు ఈ పిటిషన్లను వేశారు. అథీకృత రుసుము/ సరిహద్దు పన్నును వసూలు చేయడం అఖిలభారత పర్యాటక వాహనాల (పర్మిట్‌) నిబంధనలు-2023కు విరుద్ధమని చెప్పారు. తాజా పన్ను వసూలుకు వీలు కల్పించే రాష్ట్ర చట్టంలోని నిబంధనలను పిటిషనర్లు సవాల్‌ చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలుత దాన్ని సవాల్‌ చేయాలంది.  


క్షయ నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా సౌమ్యా స్వామినాథన్‌

దిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్‌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. క్షయ వ్యాధి నిర్మూలనకు సంబంధించి స్వామినాథన్‌ సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు తగిన సూచనలు అందిస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.


ఎన్‌బీడీఏ అధ్యక్షుడిగా రజత్‌శర్మ 

దిల్లీ: అఖిల భారత ‘న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్‌ అసోసియేషన్‌’ (ఎన్‌బీడీఏ) అధ్యక్షుడిగా ‘ఇండియా టీవీ’ ఛైర్మన్‌ రజత్‌శర్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారం దిల్లీలో జరిగిన ఎన్‌బీడీఏ బోర్డు సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. భారత్‌లోని వార్తా ప్రసారకులు, డిజిటల్‌ మీడియాకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద సంఘమిది. దేశంలోని దాదాపు అన్ని పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌లకు ఇందులో సభ్యత్వముంది. ఈ సందర్భంగా రజత్‌శర్మ మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వార్తా పరిశ్రమ నేడు పలు ముఖ్యమైన సవాళ్లు, తీవ్రమైన ఒత్తిళ్ల నడుమ పనిచేస్తోంది. సంఘటితంగా కృషి చేసి ఈ రంగం ప్రయోజనాలు కాపాడాలి. అందరూ భయానికి చోటు లేని వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయమైన సమాచారం ప్రసారం చేసేలా చూడటం మనందరి బాధ్యత’’ అన్నారు. ఈ మేరకు ఎన్‌బీడీఏ సెక్రటరీ జనరల్‌ అన్నీ జోసెఫ్‌ ఓ ప్రకటనలో సమావేశ వివరాలు వెల్లడించారు.


కేజ్రీవాల్‌పై ఈడీ ఏడో ఛార్జిషీట్‌ 

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఏడో అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తన అభియోగపత్రంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీల పేర్లను చేర్చింది. ఈ మేరకు ఈ నెల 12న హాజరు కావాలని కేజ్రీవాల్‌కు కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా సమన్లు జారీ చేశారు. మద్యం కేసులో దిల్లీ ప్రధాన సూత్రధారుడిగా ఆరోపిస్తూ కేజ్రీవాల్‌ను మార్చి 21  ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


సుప్రీంకోర్టుకు ఐఎంఏ అధ్యక్షుడి క్షమాపణ

దిల్లీ: పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ గురించి పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పానని, అది వివిధ పత్రికల్లోనూ ప్రచురితమైందని భారత వైద్య సంఘం(ఐఎంఏ) అధ్యక్షుడు ఆర్‌.వి.అశోకన్‌ మంగళవారం భారత అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కొవిడ్‌ టీకాలు, అలోపతి వైద్య విధానంపై పతంజలి దుష్ప్రచారం చేస్తోందంటూ 2022లో ఐఎంఏ దాఖలు చేసిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోకన్‌ తమను ఉద్దేశించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడాన్ని మే 14 నాటి విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో ఆయన బేషరతు క్షమాపణ చెప్పారు.


నీట్‌-యూజీ లీక్‌ కేసులో మరో ఇద్దరి అరెస్టు 

దిల్లీ: వైద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌-యూజీ పరీక్ష పశ్నపత్రం లీక్‌ కేసులో బిహార్‌లో మరో ఇద్దరు నిందితులు అరెస్టయ్యారు. నలందలో నీట్‌-యూజీ అభ్యర్థి సన్నీ, గయాలో రంజిత్‌ కుమార్‌ అనే ఆశావాహుడి తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మంగళవారం ప్రకటించింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11కు చేరుకుంది. బిహార్‌లో ఎనిమిది మంది, లాతూర్, గోధ్రా, దేహ్రాదూన్‌ల నుంచి ఒకరు చొప్పున నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. 


పూజా సామాగ్రిని ముస్లింలు విక్రయించకుండా నిషేధం విధించాలి: వీహెచ్‌పీ

దిల్లీ: హిందువుల పుణ్యక్షేత్రాల్లో, ఆలయాల వద్ద ముస్లింలు పూజాసామగ్రిని విక్రయిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఆరోపించింది. ఇది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌ బజరంగ్‌ బగ్ర తెలిపారు. ముస్లింలు పూజాసామగ్రి విక్రయ దుకాణాలు నిర్వహించకుండా అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


జనాభా నియంత్రణ విధానానికి ‘ఆర్గనైజర్‌’ డిమాండ్‌

దిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభాపరమైన అసమతౌల్యత ఏర్పడుతోందని ఆరెస్సెస్‌ అనుబంధ వీక్లీ మేగజీన్‌ ‘ఆర్గనైజర్‌’ పేర్కొంది. జాతీయ జనాభా నియంత్రణకు సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. జనాభా నియంత్రణలో దక్షిణ, పశ్చిమ భారత్‌లోని రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని