సైన్యాన్ని రెండు వర్గాలుగా విభజించకండి

అగ్నిపథ్‌ పథకంపై, అగ్నివీరుల కుటుంబానికి పరిహారంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో అసత్యాలు చెప్పారని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి ఆరోపించారు.

Published : 10 Jul 2024 04:35 IST

అగ్నిపథ్‌ పథకంపై కీర్తిచక్ర పురస్కార గ్రహీత తల్లి విజ్ఞప్తి
అమర సైనికుడి కుటుంబంతో రాహుల్‌ గాంధీ భేటీ

రాయ్‌బరేలీ: అగ్నిపథ్‌ పథకంపై, అగ్నివీరుల కుటుంబానికి పరిహారంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో అసత్యాలు చెప్పారని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి ఆరోపించారు. మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి వచ్చిన రాహుల్‌ విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు కీర్తి చక్ర పురస్కార గ్రహీత కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. గత ఏడాది జులైలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ప్రజలను రక్షించే క్రమంలో కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు ఆ పురస్కారాన్ని అందజేశారు. రాహుల్‌ గాంధీతో భేటీ అనంతరం కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ మాతృమూర్తి మంజూ సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘సైన్యాన్ని రెండు వర్గాలుగా విభజించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందించే అగ్నివీరులు ఆ తర్వాత తమ చదువులు కొనసాగించే విషయంలో మానసికంగా, శారీరకంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మరో వృత్తిని ఎంచుకోవడంలో ఇబ్బందిపడతారు’ అని ఆమె పేర్కొన్నారు. తొలుత దిల్లీ నుంచి విమానంలో లఖ్‌నవూ చేరుకున్న రాహుల్‌ గాంధీ...అక్కడి నుంచి రాయ్‌బరేలీకి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. మధ్యలో బచ్చర్వాన్‌ సమీప చుర్వా హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. లఖ్‌నవూలో నివసించే కెప్టెన్‌ అన్షుమాన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను రాయ్‌బరేలీకి పిలిపించి వారితో మాట్లాడారు. ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.  రాయ్‌బరేలీలోని ఎయిమ్స్‌ను సందర్శించిన రాహుల్‌ అక్కడ రోగులతో కాసేపు మాట్లాడారు. వారికి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని