నిర్వాహకులదే బాధ్యత

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యతని సిట్‌ నివేదిక తేల్చింది.

Updated : 10 Jul 2024 04:49 IST

‘హాథ్రస్‌ తొక్కిసలాట’లో కుట్ర కోణాన్నీ కొట్టిపారేయలేం
యూపీ సర్కారుకు సిట్‌ నివేదిక

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యతని సిట్‌ నివేదిక తేల్చింది. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా తాము కొట్టిపారేయలేమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సిట్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు యూపీ సర్కార్‌కు తొక్కిసలాట ఘటనపై మంగళవారం నివేదిక సమర్పించింది. ‘‘ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా.. నిర్వాహకుల వైఫల్యమే కారణమని ప్రాథమికంగా తెలిసింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్‌ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారు. పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించి..వారికి కనీస ఏర్పాట్లు చేయలేదు. ప్రమాదం జరగ్గానే కమిటీ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు’’ అని సిట్‌ తన నివేదికలో వెల్లడించింది. 

పోలీసులూ దృష్టిపెట్టలేదు..

స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంపై దృష్టి సారించలేదని సిట్‌ తెలిపింది. సత్సంగ్‌ జరిగే వేదిక ప్రాంగణాన్ని తనిఖీ చేయకుండానే సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌  అనుమతులు ఇచ్చారని సిట్‌ పేర్కొంది. సర్కిల్‌ ఆఫీసర్, రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్, ఔట్‌పోస్ట్‌ ఇన్‌ఛార్జ్‌ అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆక్షేపించింది. నివేదిక ఆధారంగా స్థానిక సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్, సర్కిల్‌ అధికారితో పాటు మరో నలుగురిని మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. జులై 2న భోలే బాబా వెళ్తుండగా ఆయన దర్శనం కోసం ప్రజలు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని