మీ త్యాగాలు వృథాపోవు

పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో సైనిక వాహనంపై జరిపిన మెరుపుదాడిలో ఐదుగురు జవాన్లు అమరులు కావడాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.

Updated : 10 Jul 2024 04:47 IST

ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటాం: రక్షణ శాఖ 
ఉగ్రదాడికి దీటుగా సమాధానమివ్వాలన్న రాష్ట్రపతి 
జమ్మూకు ఎన్‌ఐయే బలగాలు

కఠువా/ జమ్మూ: పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీర్‌లోని కఠువా జిల్లాలో సైనిక వాహనంపై జరిపిన మెరుపుదాడిలో ఐదుగురు జవాన్లు అమరులు కావడాన్ని కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. తగినరీతిలో ప్రతీకారం తీర్చుకోవాలని రక్షణశాఖ ప్రతినబూనింది. ఘాతుకానికి పాల్పడినవారి అంతు చూస్తామని హెచ్చరించింది. ఉగ్రవాదులకు దీటైన సమాధానమివ్వాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సోమవారం నాటి ఘటనపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐయే) బలగాలు జమ్మూకు తరలివెళ్లాయి. మంగళవారం డోడా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసరడం గమనార్హం. ఉగ్రవాదుల కదలికలున్నాయన్న సమాచారంతో అక్కడ బలగాలు గాలిస్తుండగా వారు తారసపడినప్పుడు కాల్పులు జరిగాయి.

ముమ్మర వేట 

కఠువా జిల్లాలో జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం అణువణువూ జల్లెడపడుతున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని రక్షణ శాఖ కార్యదర్శి అరమానె గిరిధర్‌ స్పష్టంచేశారు. మృతిచెందిన ఐదుగురు జవాన్లు ఉత్తరాఖండ్‌కు చెందిన వారే. ముందుగా రెక్కీ నిర్వహించి, స్థానికుల సాయంతో అధునాతన ఆయుధాలు ఉపయోగించి, ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో బడ్‌నోటా అనే గ్రామం వద్ద రోడ్డు బాగోలేదు. ఏ వాహనమైనా ఇక్కడ గంటకు 15 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే. ఉగ్రవాదులు ముందుగా రెక్కీ నిర్వహించి దాడికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటువేశారు. ఈ ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా సమీపంలోని ఓ కొండపై ముష్కరులు మాటు వేశారు.

తొలి లక్ష్యం వాహన డ్రైవరే

తాము లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి వాహనం రాగానే ముష్కరులు తొలుత గ్రనేడ్‌ విసిరారు. డ్రైౖవర్‌ లక్ష్యంగా కాల్పులు జరిపారు. నిలిచిపోయిన వాహనంపై రెండువైపుల నుంచి గుళ్లవర్షం కురిపించారు. తర్వాత తమ స్థావరాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. అదనపు బలగాలు అక్కడికి చేరుకొని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులవద్ద భారీ స్థాయిలో ఆయుధాలు ఉండొచ్చని సమాచారం. మరణోత్తర పరీక్షల అనంతరం అంత్యక్రియల నిమిత్తం వీర సైనికుల మృతదేహాలను వారివారి స్వస్థలాలకు హెలికాప్టర్లలో తరలించారు. పరిస్థితిపై జమ్మూకశ్మీర్‌ డీజీపీ స్వెయిన్‌ క్షేత్రస్థాయి సమీక్ష జరిపారు. ఘటనాస్థలమంతా రక్తపు చారికలు, శిరస్త్రాణాలు, తూటా తొడుగులు, పగిలిన అద్దాలతో నిండి ఉంది. 

స్థానిక గైడ్ల చేయూత! 

ముష్కరులు రెక్కీ నిర్వహించడానికి, వారికి ఆహారం సమకూర్చడానికి స్థానిక గైడ్లే సాయం చేశారని అనుమానిస్తున్నారు. పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన కఠువా ప్రాంతంలోకి రెండునెలల క్రితమే పెద్దసంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం ఉంది. అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలు వైదొలగిన తర్వాత తాలిబన్ల నుంచి లష్కరే, జైషేలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అవి పాక్‌ మీదుగా కశ్మీర్‌లోకి చేరుతున్నాయి. 

ముర్ము, రాజ్‌నాథ్, రాహుల్‌ సంతాపం

ఉగ్రదాడిలో ఐదుగురు సైనికుల మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ తదితరులు సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో మృతవీరుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. దాడిని పిరికిపంద చర్యగా రాష్ట్రపతి అభివర్ణించారు. ఉగ్రవాద బెడద నిర్మూలనకు పటిష్ఠ చర్యలు ఉండాలని, ఊకదంపుడు మాటలతో ఉపయోగం లేదని రాహుల్‌ పేర్కొన్నారు. పూంఛ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ డ్రోన్‌పై సైనిక దళాలు కాల్పులు జరిపాయి. కాసేపటి తర్వాత అది వెనుదిరిగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని