రాష్ట్రాల సరిహద్దు పన్నులపై హైకోర్టులకే వెళ్లండి

ఆలిండియా టూరిస్ట్‌ వెహికల్స్‌ పర్మిట్‌ రూల్స్‌ - 2023కు విరుద్ధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆథరైజేషన్‌ ఫీజు/సరిహద్దు పన్నులను రద్దు చేయాలని కోరుతూ ముత్యాల సునీల్‌కుమార్‌తోపాటు మరో 117 మంది దాఖలుచేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది.

Published : 11 Jul 2024 03:55 IST

ఈనాడు, దిల్లీ: ఆలిండియా టూరిస్ట్‌ వెహికల్స్‌ పర్మిట్‌ రూల్స్‌ - 2023కు విరుద్ధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆథరైజేషన్‌ ఫీజు/సరిహద్దు పన్నులను రద్దు చేయాలని కోరుతూ ముత్యాల సునీల్‌కుమార్‌తోపాటు మరో 117 మంది దాఖలుచేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. దీనిపై పిటిషనర్లు తమ పరిధిలోని హైకోర్టులకే వెళ్లాలని నిర్దేశిస్తూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘‘వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దుపన్ను/ఆథరైజేషన్‌ ఫీజును డిమాండ్‌ చేస్తున్నట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఆలిండియా పర్మిట్‌ ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఇలా పన్నులు వసూలుచేయడం డబుల్‌ ట్యాక్స్‌ కిందికి వస్తుందన్నది వారి వాదన. ఎలాంటి చట్టబద్ధమైన అధికారం లేకున్నా ఇలా పన్ను వసూలుచేయడం ఆలిండియా టూరిస్ట్‌ వెహికల్స్‌ పర్మిట్‌ రూల్స్‌-2023 ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. అయితే, పిటిషనర్లు ఈ ఫీజులు, పన్నుల వసూలులో రాష్ట్రాలు అమలుచేస్తున్న నిబంధనలను సవాలు చేయలేదు. కాబట్టి, సరిహద్దు పన్ను/ఆథరైజేషన్‌ ఫీజు వసూలుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు బాగాలేవని చెప్పలేం. పిటిషనర్లు రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలను సవాలు చేస్తూ మొదట తమ పరిధిలోని హైకోర్టులకు వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు రాష్ట్ర హైకోర్టులను ఆశ్రయించేందుకు అవకాశం ఇస్తున్నాం. ఇప్పటికే విధించిన పన్ను రికవరీ అన్నది ఈ కేసుల్లో హైకోర్టులు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని