సంక్షిప్త వార్తలు (4)

రైతుల ఉద్యమం సందర్భంగా హరియాణాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన అడ్డుకట్టల్ని వారంలోగా తొలగించాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు బుధవారం ఆదేశించింది.

Updated : 11 Jul 2024 04:24 IST

శంభూ సరిహద్దును వారంలో తెరవండి: హైకోర్టు

చండీగఢ్‌: రైతుల ఉద్యమం సందర్భంగా హరియాణాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన అడ్డుకట్టల్ని వారంలోగా తొలగించాలని పంజాబ్‌-హరియాణా హైకోర్టు బుధవారం ఆదేశించింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా వివిధ డిమాండ్ల సాధనకు దిల్లీకి తరలివెళ్తామని రైతుల సంఘాలు ప్రకటించడంతో అంబాలా-కొత్తదిల్లీ జాతీయ రహదారిపై ఫిబ్రవరి నుంచి హరియాణా ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. 


వైద్య కళాశాలలుగా మారినా ఆసుపత్రులకు నిధులు ఆగవు: కేంద్రం

దిల్లీ: వైద్య కళాశాలలుగా మారిన జిల్లా, రిఫరెల్‌ ఆసుపత్రులకు ఇక మీదటా కేంద్రం నుంచి నిధులు అందుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర స్పష్టంచేశారు. జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం) కింద సాయం నిలిచిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారమిచ్చారు.  


ఘరానా మోసాలు ఆర్థిక, న్యాయ వ్యవస్థలకు పెను సవాల్‌

 జస్టిస్‌ హిమా కోహ్లి వ్యాఖ్య

దిల్లీ: సమాజంలో గౌరవనీయ వ్యక్తులుగా చలామణి అయ్యే వ్యక్తులు చేసే మోసాలు, నేరాలు ఆర్థిక, న్యాయ వ్యవస్థలకు పెను సవాల్‌ విసురుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి తెలిపారు. వీటిని అరికట్టడానికి సునిశిత పరిశీలనతో పాటు బహుళ విధానాలను, అత్యాధునిక సాంకేతికతలను వినియోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘ఆర్థిక నేరాలు-కార్పొరేట్‌ దురాచాలపై న్యాయస్థానాల దృష్టికోణం’ అనే అంశంపై బుధవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఘరానా మోసాలను నిరోధించడంలో దృఢమైన శాసన, న్యాయ వ్యవస్థలు, అంకితభావం కలిగిన యంత్రాంగాలు కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. ప్రభావవంతమైన తీర్పులు సకాలంలో వెలువడాలంటే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు  ఆర్థిక నేరాలపై పరిశోధనల్లో నిష్ణాతులైన వ్యక్తుల సహకారం తీసుకోవాలన్నారు. సాధారణ నేరాలకు, ఘరానా నేరాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత పకడ్బందీగా, వృత్తినిపుణుల తోడ్పాడుతో ఎవరికీ అంతుచిక్కని విధంగా ఘరానా మోసాలు జరుగుతుంటాయని, అంతులేని దురాశ వారికి ఉంటుందని వివరించారు. డిజిటల్‌ మోసాలను అరికట్టడానికి బలిష్ఠమైన సైబర్‌ సెక్యూరిటీ నియంత్రణలు ఉండాలని సూచించారు. సాధారణ నేరాలు భావోద్వేగపరమైన నష్టాన్ని, భౌతికపరమైన హానిని కలిగిస్తుంటాయని, ఈ నేరగాళ్లను గుర్తించడం సులభమేనన్నారు. 


స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరణ తీర్పు సమీక్ష కేసులో మలుపు

 విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

దిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును నిరాకరిస్తూ గత ఏడాది వెలువరించిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వైదొలగారు. వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకొంటున్నట్లు ఆయన తెలిపారని సమాచారం. దీంతో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని మరోసారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ఉన్నారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్థానంలో మరొకరిని ఈ ధర్మాసనంలోకి తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని