ఆగస్టు 30కల్లా దత్తత సంస్థలు ఏర్పడకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు

చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక దత్తత సంస్థల (స్పెషలైజ్డ్‌ ఆడాప్షన్‌ ఏజెన్సీస్‌) ఏర్పాటును అన్ని రాష్ట్రాలూ ఆగస్టు 30కల్లా పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

Published : 11 Jul 2024 03:40 IST

 సీజేఐ ధర్మాసనం హెచ్చరిక

ఈనాడు, దిల్లీ: చిన్నారుల దత్తత ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక దత్తత సంస్థల (స్పెషలైజ్డ్‌ ఆడాప్షన్‌ ఏజెన్సీస్‌) ఏర్పాటును అన్ని రాష్ట్రాలూ ఆగస్టు 30కల్లా పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలో దత్తత నిబంధనలను సరళతరం చేయాలని కోరుతూ ‘టెంపుల్‌ హీలింగ్‌’ అనే ధార్మిక సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యంలో సుప్రీంకోర్టు ఈమేరకు ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికే ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని గతంలో ఆదేశించినా కొన్ని రాష్ట్రాలు అమలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 390 జిల్లాల్లో మాత్రమే ఇలాంటి సంస్థలు పని చేస్తున్నాయి. మిగతా 370 జిల్లాల్లో ఆ సంస్థలు లేకపోవడం వల్ల పిల్లల దత్తత స్వీకరణకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ జిల్లాల్లో ఆగస్టు 30కల్లా దత్తత సంస్థలను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో సెప్టెంబరు 2న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని