వైద్యులు పదో వంతు చీటీల్లో అనవసర ఔషధాలు రాస్తున్నారు

దేశంలో వైద్యులు రాసే ప్రతి రెండు మందుల చీటీల్లో ఒకటి అంతర్జాతీయ మార్గదర్శకాలకు భిన్నంగా ఉంటోందని ఒక అధ్యయనం వెల్లడించింది.

Published : 11 Jul 2024 03:41 IST

వెల్లడించిన అధ్యయనం 

దిల్లీ: దేశంలో వైద్యులు రాసే ప్రతి రెండు మందుల చీటీల్లో ఒకటి అంతర్జాతీయ మార్గదర్శకాలకు భిన్నంగా ఉంటోందని ఒక అధ్యయనం వెల్లడించింది. పదో వంతు చీటీలు మార్గదర్శక సూత్రాలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు హెచ్చరించింది. దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులతో పాటు మరికొందరు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. 2019-2020 మధ్య బోధనాస్పత్రులు, వైద్య కళాశాలల్లో రాసిన 4,838 మందుల చీటీలను వారు పరిశీలించగా, వాటిలో 475 చీటీలు మార్గదర్శకాలను ఖాతరు చేయలేదని తేలింది. అవసరం లేకున్నా పాంటాప్రజోల్‌ మందును 54 చీటీలలో అనవసరంగా రాశారు. పొట్టలో ఆమ్లాన్ని తగ్గించే ఈ మందు పాన్‌ 40, పాన్‌ టాప్‌ వంటి రకరకాల పేర్లతో అన్ని మందుల దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని ఒంటి మీద దద్దుర్లు కలిగించే హెర్పెస్‌ జోస్టర్‌ వ్యాధికి కూడా రాసారు. పాంటాప్రజోల్‌ తరవాత ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్న మందుల మిశ్రమం- రాబెప్రజోల్‌-డామ్‌ పెరిడోన్‌. ఈ మందుల మిశ్రమాన్ని పారాసెటమాల్, లెవో సెట్రిజైన్‌తో కలిపి జలుబు, ఎగువ శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగించడం జరుగుతోంది. ఇలా అనవసరమైన మందులను రాయడం వల్ల చికిత్స ఖర్చు పెరగడమే కాదు, ప్రతికూల ఫలితాలూ వస్తాయి. పొట్టలో పుండు ఏర్పడకుండా నివారించడానికి వాడే పాంటాప్రజోల్‌ వంటి మందులను అనవసరంగా వాడితే కడుపు ఉబ్బరం, చర్మం మీద దద్దుర్లు, ఎడిమా వంటి ప్రతికూల ఫలితాలు వస్తాయి. వివిధ వ్యాధులకు ఏయే మందులు వాడాలో నిర్దేశించడానికి భారత్‌లో ప్రత్యేక మార్గదర్శకాలేమీ రూపొందలేదు. అమెరికా హృద్రోగ వైద్యుల సంఘం వంటి సంఘాల మార్గదర్శకాలనే ఇక్కడా అనుసరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని