నకిలీ ఖాతాదారులను తొలగించేందుకే ఆధార్‌ ఈ-కేవైసీ ధ్రువీకరణ

ఎల్‌పీజీ సిలిండర్లకు సంబంధించి నకిలీ వినియోగదారులను తొలగించేందుకే ప్రభుత్వ అధీనంలోని చమురు రంగ సంస్థలు ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

Published : 11 Jul 2024 03:42 IST

ఎల్‌పీజీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరి
కేంద్ర ఇంధన శాఖ మంత్రి పురి స్పష్టీకరణ 

దిల్లీ: ఎల్‌పీజీ సిలిండర్లకు సంబంధించి నకిలీ వినియోగదారులను తొలగించేందుకే ప్రభుత్వ అధీనంలోని చమురు రంగ సంస్థలు ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. కొన్ని గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు నకిలీ వినియోగదారుల ఖాతాలతో వాణిజ్య సిలిండర్లు బుక్‌ చేస్తున్నాయని, దాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఆధార్‌ ఈ-కేవైసీ ధ్రువీకరణను కేంద్రం తప్పనిసరి చేయడం వల్ల సామాన్యులు గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కేరళ శాసనసభ విపక్ష నాయకుడు వీడీ సతీశన్‌ రాసిన లేఖపై ఆయన పై మేరకు స్పందించారు. ఈ-కేవైసీ ప్రక్రియ గత ఎనిమిది నెలల నుంచి కొనసాగుతున్నట్లు పురి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ కోసం వినియోగదారులు ఏజెన్సీల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ను డెలివరీ చేసే వ్యక్తులు తమ వద్ద ఉన్న యాప్‌ ద్వారా వినియోగదారుల ఆధార్‌ వివరాలు సేకరించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. లేదంటే వినియోగదారులు తమ ఫోన్లోనే చమురు సంస్థ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ-కేవైసీ ప్రక్రియను చేసుకోవచ్చని తెలిపారు. దీనికి ఎటువంటి నిర్దిష్ట గడువు లేదని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని