ఇక మార్కెట్లోకి తొలి దేశీయ నిమోనియా టీకా

నిమోనియా కట్టడికి దేశీయంగా తయారైన తొలి వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) అభివృద్ధి

Published : 25 Dec 2020 04:57 IST

అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌

దిల్లీ: నిమోనియా కట్టడికి దేశీయంగా తయారైన తొలి వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ) అభివృద్ధి చేసిన ఈ టీకాను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫైజర్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ నిమోనియా వ్యాక్సిన్ల కంటే ఇది చవకగా లభించనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘నిమోకోకల్‌ పాలిసాకరైడ్‌ కంజ్యుగేట్‌ వ్యాక్సిన్‌’ మూడు దశల క్లినికల్‌ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుంది. దీంతో గత జులైలోనే భారత ఔషధ నియంత్రణ సంస్థ ఈ టీకా విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ‘‘శిశువుల్లో స్ట్రెప్టోకోకస్‌ నిమోనియా కారణంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలను అధిగమించేలా వారిలో రోగ నిరోధకతను పెంపొందించేందుకు సీరం టీకా ఉపయోగపడుతుంది. భారత్‌లో తయారీ కార్యక్రమంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. యునిసెఫ్‌ గణాంకాల ప్రకారం- భారత్‌లో ఏటా లక్ష మందికిపైగా ఐదేళ్లలోపు చిన్నారులు నిమోనియా కారక వ్యాధులతో మృతిచెందుతున్నారు. కరోనా మహమ్మారి నెలకొన్న తరుణంలో సీరం వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుండటం శుభపరిణామమని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ నిమోనియా టీకా అనుమతులు పొందిన క్రమంలో... సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల అదనపు సంచాలకులు ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ కేంద్ర ఆరోగ్యమంత్రికి లేఖ రాశారు. ‘‘ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్‌ పిలుపును అందుకుని లాక్‌డౌన్‌ సమయంలో మరో చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాం. ప్రపంచ స్థాయి పీసీవీ వ్యాక్సిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీనికి అనుమతులు కూడా వచ్చాయి’’ అని ఆయన అందులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని